Sep 11,2023 22:06

కోటబొమ్మాళి : ఆందోళన చేస్తున్న టిడిపి నాయకులు

* మూతపడిన దుకాణాలు
* కొన్నిచోట్ల బ్యాంకులు మూసివేత
* విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన యాజమాన్యాలు
* పలుచోట్ల రహదారులపై టిడిపి శ్రేణుల ఆందోళన, అరెస్టులు
* మూడో రోజూ సాగిన ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి / యంత్రాంగం: 
    తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టిడిపి సోమవారం చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో పలుచోట్ల ఆర్‌టిసి కాంప్లెక్సులు, రహదారులపై టిడిపి శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. రోడ్లపై బైఠాయించడంతో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో పలుచోట్ల విద్యాసంస్థలు, దుకాణాలు మూతపడ్డాయి. ప్రయివేట్‌ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. టెక్కలిలో జాతీయ రహదారిపై టిడిపి నాయకులు ఆందోళనకు దిగడంతో సుమారు 20 నిమిషాల పాటు ఇరువైపులా ట్రాఫిక్‌ స్తంభించింది. శ్రీకాకుళం, పలాస ఆర్‌టిసి కాంప్లెక్సుల్లో బస్సులను అడ్డుకునేందుకు వచ్చిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో పాటు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, ముఖ్య నాయకుల గృహ నిర్బంధం మూడో రోజూ కొనసాగింది.
టిడిపి బంద్‌ పిలుపు నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలోని అరసవల్లిలో గుండ అప్పలసూర్యనారాయణ, లకీëదేవి దంపతులను వారి నివాసంలో పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. బస్సులను ఆపేందుకు టిడిపి శ్రీకాకుళం నగర పార్టీ నాయకులు ఉదయం ఆరు గంటలకు ఆర్‌టిసి కాంప్లెక్సుకు చేరుకున్నారు. కాంప్లెక్సుకు ఎదురుగా కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. అప్పటికే వాహనాలతో సిద్ధంగా ఉన్న పోలీసులు వారిని అరెస్టు చేసి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు గొండు శంకర్‌ను శ్రీకాకుళం రూరల్‌ పోలీసులు కిష్టప్పపేటలోని ఆయన ఇంట్లో హౌస్‌ అరెస్టు చేశారు. సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే గుండ లకీëదేవి ఆధ్వర్యాన టిడిపి నాయకులు నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ దాష్టీకానికి చీకటి రోజని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనం కోసం జగన్‌ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
కవిటిలో...
కవిటిలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. జాడుపుడి ఆర్‌.ఎస్‌లో టిడిపి నాయకులు బంద్‌ పాటించారు. విద్యాసంస్థలు, దుకాణాలు మూయించి నిరసన వ్యక్తం చేశారు.
సోంపేటలో...
సోంపేటలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషను పలాసకు రానివ్వకుండా పోలీసులు ఇంటి వద్దే హౌస్‌ అరెస్టు చేశారు. ఉదయం నుంచే గౌతు శివాజీ ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు బంద్‌ను పాటించాయి. మాజీ ఎంపిపి చిత్రాడ శ్రీను, మాజీ జెడ్‌పిటిసి సూరాడ చంద్రమోహన్‌, బీన ఆనంద్‌ తదితరులను అరెస్టు చేశారు. బారువలో నాగేశ్వరరావు, ఎం కుమార్‌, దున్న సత్యం, టి.వాసు, ఆర్‌.రమణ తదితరులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఆమదాలవలసలో...
ఆమదాలవలసలో తెలుగు మహిళా జిల్లా అధ్యక్షులు మెట్ట సుజాత ఆధ్వర్యాన ఉదయం 7 గంటల నుంచి టిడిపి శ్రేణులు రోడ్డుపైకి వచ్చి బంద్‌ను నిర్వహించాయి. పట్టణ శివారున ఉన్న ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పైన టిడిపి శ్రేణులు రాస్తారోకో చేయడంతో పాలకొండ-శ్రీకాకుళం రోడ్డుపైన భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. తమ్మినేని సుజాతతో పాటు టిడిపి మండల అధ్యక్షులు నూకరాజు, చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. టిడిపి జిల్లా కార్యాలయ కార్యదర్శి మొదలవలస రమేష్‌, టిడిపి మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు
కోటబొమ్మాళిలో...
కోటబొమ్మాళి రైతుబజారు నుంచి కొత్తపేట వరకు ర్యాలీ నిర్వహించి షాపులను మూసివేసి బంద్‌కు సహకరించాలని వ్యాపారులను టిడిపి నాయకులు కోరారు. పోలీసులు ర్యాలీని అడ్డుకుని టిడిపి రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, మాజీ ఎంపిపి తర్ర రామకృష్ణ, ఎఎంసి మాజీ చైర్మన్‌ వెలమల కామేశ్వరరావు తదితరులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. నియోజకవర్గ మహిళా అధ్యక్షులు పూజారి శైలజ, మాజీ ఎంపిపి వెలమల విజయలక్ష్మి, గొండు లక్ష్మణరావు తదితరులు ర్యాలీ నిర్వహించారు. టిడిపి నాయకులు బోయిన రమేష్‌ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
పొందూరులో...
పొందూరులో టిడిపి నాయకుల ఇళ్లకు పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మండలంలోని పొందూరు పట్టణం, కింతలి కూడలి, లోలుగు కూడలిలో పెద్దఎత్తున టిడిపి కార్యకర్తలు నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించి బంద్‌ చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, దుకాణాలు, సినిమా హాళ్లు మూసివేశారు. టిడిపి మండల అధ్యక్షుడు చిగిలిపల్లి రామ్మోహన్‌, సీపాన శ్రీరంగనాయకులు, అన్నెపు రాము తదితరులు పాల్గొన్నారు.
పలాసలో...
వలాసలో ఆర్‌టిసి బస్సులను ఆపేందుకు ప్రయత్నించిన టిడిపి నాయకులు పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి విఠల్‌రావు, పట్టణాధ్యక్షులు బి.నాగరాజు తదితరులున్నారు.
మందసలో...
మందస మండలం హరిపురంలో టిడిపి మండల అధ్యక్షుడు భావన దుర్యోధనతో పాటు పలువురిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.
సరుబుజ్జిలిలో...
సరుబుజ్జిలి మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన టిడిపి మండల అధ్యక్షుడు ఎ.రాంబాబుతో పాటు పలువురిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రొట్టవలస వద్ద అలికాం-బత్తిలి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన తెలుగు యువత మండల అధ్యక్షుడు తాడేల రాజారావు, నాయకులను అరెస్టు చేశారు. జనసేన నాయకులను ముందస్తు అరెస్టు చేశారు.
టెక్కలిలో...
టెక్కలిలో టిడిపి శ్రేణులు జాతీయ రహదారి పైకి చేరుకుని ధర్నా చేపట్టాయి. దీంతో 20 నిమిషాల పాటు రహదారికి ఇరువైపులా ట్రాఫిక్‌ స్తంభించింది. టిడిపి మండల అధ్యక్షుడు బగాది శేషగిరిరావుతో పాటు పలువురిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మెళియాపుట్టిలో...
మెళియాపుట్టి, చాపర, జాడుపల్లి, పట్టుపురం తదితర గ్రామాల్లో టిడిపి నాయకులు ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ దుకాణాలను మూసివేశారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భాస్కర్‌ గౌడ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు
వజ్రపుకొత్తూరులో...
పూండి రహదారి కూడలిలో ధర్నాకు దిగిన నాయకులు పుచ్చ ఈశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి కర్ని రమణ, రెయ్యపాడు మాజీ సర్పంచ్‌ సైనీ బాలాజీని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పోలాకిలో...
పోలాకిలోని కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పోలాకి కేంద్రంలో టిడిపి నాయకులు ఎం.వెంకట అప్పలనాయుడు, లుకలాపు రాంబాబు, బైరి భాస్కరరావును హౌస్‌ అరెస్ట్‌ చేశారు.
లావేరులో...
లావేరు మండలంలో లావేరు, సుభద్రాపురం, వెంకటాపురంలో టిడిపి నాయకులు దుకాణాలను మూసివేయించారు. ఎఎంసి మాజీ చైర్మన్‌ ఇనపకుర్తి తోటయ్యదొర ఆధ్వర్యాన లావేటిపాలెం, కేశవరాయునిపురం, జి.జి.వలస, లావేరులోని జెడ్‌పి పాఠశాలలు, జూనియర్‌ కళాశాల, ఎపిజివి బ్యాంకును మూసివేయించారు. తాళ్లవలసలో టిడిపి మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్‌ను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.
జలుమూరులో...
జలుమూరులో బంద్‌ పాక్షికంగా జరిగింది. దుకాణాలు యదావిధిగా తెరుచుకున్నాయి. ప్రయివేట్‌ పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి.
కొత్తూరులో...
కొత్తూరు నాలుగు రోడ్లు కూడలిలో దుకాణాలను మూసివేయించేందుకు ప్రయత్నించిన టిడిపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో అగతముడి అరుణ్‌ కుమార్‌, లోతుగెడ్డ భగవాన్‌దాస్‌ నాయుడు, టి.తిరుపతిరావు, ఎం.కృష్ణ తదితరులున్నారు.
నందిగాంలో...
నందిగాం టిడిపి మండల నాయకులు అజరుకుమార్‌, ప్రసాదరావు, అట్ట రవిప్రసాద్‌లను వారి వారి ఇళ్ల వద్ద ఉదయం ఆరు గంటలకే పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.
కంచిలో...
కంచిలితో పాటు పరిసర గ్రామాలోని షాపులు మూతపడ్డాయి. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను మూసివేయించారు. ప్రయివేటు బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పది గంటలు తరువాత ఆటోలు తిరిగాయి.
ఇచ్ఛాపురంలో...
ఇచ్ఛాపురంలో బ్యాంకులు, ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. బంద్‌ చేస్తున్న సమయంలో పోలీసులు జోక్యంతో ప్రభుత్వ విద్యాసంస్థలు యధావిధిగా పనిచేశాయి.