ప్రజాశక్తి-గుడ్లూరు :రామాయపట్నం పోర్టు పరిధిలో బలవంతపు భూసేకరణ ఆపాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు. రైతులంతా ఐక్యంగా ఈ బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గుడ్లూరు మండలం రావూరు గ్రామంలో బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులతో కలిసి పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం సభ నిర్వహించారు. ఈ సభకు పి. కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సి హెచ్ నరసింగరావు మాట్లాడుతూ గ్రామం మొత్తం ఏకగ్రీవంగా తామ భూములు ఇచ్చేది లేదని చెప్పినప్పటికీ ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకోవడం సరి కాదన్నారు. వెంటనే బలవంతపు భూసేకరణ ఆపి రావూరు గ్రామ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోర్టుకు అనుబంధంగా 20 కిలోమీటర్లు పరిధిలో పరిశ్రమలు పెట్టవచ్చునని, రైతులు వద్దనున్న తరువాత,పెట్టడం సరికాదన్నారు. భూమి తల్లి లాంటిది, భూమిని వదిలేస్తే, భూ యజమానులు, భూమి మీద బ్రతికే వ్యవసాయ కూలీలు ఎలా బతకాలని ప్రశ్నించారు. రైతు భూమిని నమ్ముకుంటాడని, భూమిని అమ్ముకొడని తెలిపారు. అలాంటి రైతు భూమిని రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలకు భూమి ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని, కానీ తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందని ఆయన గుర్తు చేశారు. రావూరు దళితులు సాగు చేస్తున్న, 180 ఎకరాల అసైన్‌మెంట్ భూములకు పట్టా భూములతో సమానంగా నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.రైల్వే ట్రాక్ కోసం భూములు ఇచ్చిన దళిత రైతులకు 12 ఎకరాలకు, చేవూరు రైతులతో పాటు నష్ట పరిహారం చెల్లించి, బావులకు బోర్లకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు జీ.వెంకటేశ్వర్లు, జీవీబీకుమార్, ఎస్. ఏ. గౌస్,పి. పెంచలయ్య,చేవూరు, రావూరు గ్రామ రైతులు ఎన్. వెంకటేశ్వర్లు, ఇరు వూరి బ్రహ్మయ్య, ఉపేంద్ర, పి.కష్ణ,యం.మురళి,వై.నరసింహారావు, వై సుబ్బా రావు, మిరియం సుబ్బారావు ఉన్నారు.










