Oct 15,2023 21:57

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కృష్ణమూర్తి

* రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
ప్రజాస్వామ్యానికి భారతదేశం పుట్టినిల్లు అనే కీర్తి నానాటికీ దిగజారిపోతోందని, భావస్వేచ్ఛ బలిపీఠంపై ఉందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో గల ప్రెస్‌క్లబ్‌లో 'బలిపీఠంపై భావస్వేచ్ఛ' అంశంపై ఆదివారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రసాదించిన భావవ్యక్తీకరణ హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు వంటిదన్నారు. ఈ హక్కు ప్రమాదంలో పడితే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని హెచ,్చరించారు. ఇటీవల దేశవ్యాప్తంగా మీడియా, న్యాయవాద, ప్రజాసంఘాలకు చెందిన ప్రతినిధుల ఇళ్లల్లో సోదాలు, నమోదైన కేసులు, నాన్‌బెయిలబుల్‌ అరెస్టులు ప్రజాస్వామ్యానికి వినిపిస్తున్న ప్రమాద సంకేతాలని చెప్పారు. విమర్శనాత్మక జర్నలిజానికి పెనుముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా కొన్ని ప్రభుత్వాలు ఇటువంటి దాడులు చేసినా, ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఈ దాడులను తీవ్రతరం చేసిందని విమర్శించారు. ఈ పరిస్థితిపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. సిపిఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ప్రజల అవసరాలను తీర్చాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ, మహిళల భద్రతకు పెనుముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ముసుగులో ప్రస్తుతం నియంతృత్వం రాజ్యమేలుతుందని విమర్శించారు. ఇస్కఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సనపల నరసింహులు మాట్లాడుతూ ప్రశ్నించే వాళ్లను మౌనంలోకి నెట్టడమే కేంద్ర ప్రభుత్వ వ్యూహమన్నారు. కార్పొరేట్ల కోసం ఎన్నో బలిదానాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వంటి ప్రభుత్వరంగ పరిశ్రమలను అమ్మకానికి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్‌ పాత్రికేయులు నల్లి ధర్మారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎఐటియుసి జిల్లా గౌరవాధ్యక్షులు చిక్కాల గోవిందరావు, కవయిత్రి ఎర్రమ్మ, జర్నలిస్టు సంఘాల నాయకులు ఎన్‌.ఈశ్వరరావు, కూన పాపారావు, సామ్నా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.వి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.