
* పలుచోట్ల రైతు, కార్మిక సంఘాల నిరసనలు
* అజరు మిశ్రాను బర్తరఫ్ చేయాలని డిమాండ్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్, టెక్కలి రూరల్, పలాస, రణస్థలం: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ, లఖింపూర్ ఖేరి ఘాతుకాన్ని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, ట్రేడ్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు మంగళవారం చేపట్టిన బ్లాక్ డే విజయవంతమైంది. శ్రీకాకుళం, టెక్కలి, పలాసలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రణస్థలంలో సభ నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని అంబేద్కర్ కూడలి వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు, కాంగ్రెస్ కిసాన్ మోర్చా జిల్లా నాయకులు సనపల అన్నాజీరావు, రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ, కౌలురైతు సంఘం జిల్లా నాయకులు పోలాకి ప్రసాదరావు, భవిరి కృష్ణమూర్తి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణేష్ మాట్లాడారు. 2021 అక్టోబర్ మూడో తేదీన రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను కారుతో తొక్కించి మారణకాండకు సూత్రధారి అయిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలన్నారు. రైతుల పోరాట ఫలితంగా నల్ల చట్టాల అమలుకు వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం, రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించాలన్నారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లు ఉపసంహరించుకోవడంతో పాటు ఉపాధి హామీని పట్టణ ప్రాంతాలకు విస్తరించి 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కె.నాగమణి, ఎ.మహాలక్ష్మి, ఎస్.అప్పన్నమ్మ, ఎ.సత్యం తదితరులు పాల్గొన్నారు.
టెక్కలిలో సిఐటియు కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు బగాది వాసుదేవరావు, సిఐటియు నాయకులు ఎన్.షణ్ముఖరావు, హెచ్.ఈశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి.ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
పలాసలో కాశీబుగ్గ పాత బస్టాండ్ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి, ఎఐకెఎం నాయకులు ఎం.రామారావు, జీడిరైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజరు కుమార్, పలు ప్రజాసంఘాల నాయకులు కె.పురుషోత్తం, టి.సింహాద్రి, సిపిఐ నాయకులు చాపర వెంకటరమణ, చాపర వేణుగోపాల్, పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దిల వినోద్, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు తామాడ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన
రణస్థలం : ఐక్య పోరాటాలతోనే హక్కులు కాపాడుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు అన్నారు. బ్లాక్ డేలో భాగంగా మండలంలో పైడిభీమవరంలోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్.అమ్మన్నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన రాతపూర్వక హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం నల్ల చట్టాలు రద్దు చేసినా ఇతర రూపాల్లో అమలు చేస్తోందని చెప్పారు. మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని విమర్శించారు. విశాఖ ఉక్కు రక్షణకు ఈనెల ఐదో తేదీన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ వద్ద నిర్వహిస్తున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. సభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, జిల్లా కోశాధికారి ఎ.సత్యనారాయణ, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.