అనంతపురం కలెక్టరేట్ : గ్రామ పంచాయతీ కార్మికులు, స్వచ్చభారత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గ్రామ పంచాయతీ, స్వచ్చభారత్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకు మునుపు సంగమేష్ సర్కిల్ నుంచి సిఐటియు నాయకులు, కార్మికులు ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏపీ గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శివప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ధర్నాకు సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కరోనా కాలంలో కార్మికులను దేవళ్లని, కరుణామయులని కొనియాడిన ప్రభుత్వం పెద్దలు నేడు వారి గోడు పట్టించుకునే స్థితిలో లేకుండా పోయారని విమర్శించారు. కార్మికులు వెట్టి చాకిరి చేయించడం దుర్మార్గంగా ఉందన్నారు. ఇచ్చే అరకొర వేతనాలు కూడా సకాలంలో ఇవ్వకుండా కార్మికులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం దుర్మార్గంగా ఉందన్నారు. గ్రామాలు, నగరాలు పరిశుభ్రంగా ఉంచూతూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్న కార్మికుల జీవితాలకు భద్రత లేకుండా పోయిందన్నారు. వేతనాలు ఇవ్వకుంటే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. తక్షణమే బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులందరికీ 11వ (పిఆర్‌సి) ప్రకారం కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలన్నారు. నాలుగు, ఐదు, సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పోస్ట్ శాంక్షన్లు ఇవ్వాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. సిఐటియు జిల్లా కోశాధికారి గోపాల్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ప్రకారం కార్మికులందరికీ పిఎఫ్, ఈఎస్‌ఐ, అమలు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి శివప్రసాద్ మాట్లాడుతూ కార్మికులకు బట్టలు, పనిముట్లు, చెప్పులు, కొబ్బరి నూనె, లాంటివి ఇవ్వాలన్నారు. అనంతరం కలెక్టరేట్ లోపలికి అధికారులను కలిసి విన్నవించేందుకు నాయకులు కార్యకర్తలు వెళ్లారు. గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైటాయించి నిరసన తెలిపారు. పోలీసులు డిపిఒ ప్రభాకర్‌రావుకు సమాచారం ఇవ్వడంతో ఆయన కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా నాయకులతో మాట్లాడారు. 8వ తేదీన జేఏసీ సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో నాయకులు, కార్మికులు ఆందోళన విరమించారు. కార్మికుల ధర్నాకు కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.బాలరంగయ్య, కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌వి.నాయుడు, హమాలి యూనియన్ నాయకులు రామాంజనేయులు, సిఐటియు నగర 1వ కమిటీ కార్యదర్శి వెంకట నారాయణ, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం, జిల్లా అధ్యక్షులు ఏటీఎం నాగరాజు, ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్టీఆర్ శ్రీనివాసులు, తాడపత్రి సిఐటియు నాయకులు జగన్‌మోహన్ రెడ్డి, రాప్తాడు సిఐటియు నాయకులు పోతులయ్య మద్ధతుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు భాష, బాలాజీ నాయక్, మధు, రాజు, నాగభూషణ, చంద్రశేఖర్, కుల్లాయమ్మ, ప్రభుదాసమ్మ, తిప్పారెడ్డి, నాగేంద్ర, నారాయణస్వామి, గంగన్న, నారాయణ, అబ్దుల్లా, కేశవులు, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.










