Jul 17,2023 22:37

జెడ్పీ ఛైర్‌పర్సన్‌కు వినతిపత్రం సమర్పిసునన్న 'శ్రీరామిరెడ్డి' యూనియన్‌ నాయకులు

         ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌    శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరా పథకంలో పని చేస్తున్న కార్మికులకు బకాయి ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని, పిఎఫ్‌ చెల్లించాలని శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికుల యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు డిమాండ్‌ చేశారు. బకాయిలు చెల్లించకపోతే ఆగస్టు 1వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మను సోమవారం కలిసి సమ్మె నోటీసు, సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు 3 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. 2022 ఆగస్టు నుంచి 2023 జూలై వరకూ 11 నెలల ఫ్రంట్‌ లైన్‌కు, అక్టోబర్‌ 2022 నుంచి జూలై 6 వరకూ 9 నెలల పిఎఫ్‌ ఇవ్వాలన్నారు. ఎఫ్‌-4 రాయదుర్గం, కళ్యాణదుర్గానికి బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ శివారెడ్డిని జీతాలు వేయమని అడుగుతుంటే తనకే ఏఫ్రిల్‌ నెల నుంచి కాంట్రాక్ట్‌ అగ్రిమెంట్‌ కాలేదని, అందుకే జీతాలు వేయలేమని చెబుతున్నారని తెలిపారు. కావున ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని బకాయి వేతనాలు చెల్లించేలా చూడాలని, పిఎఫ్‌ చెల్లించాలన్నారు. లేనిపక్షంలో ఆగస్టు 1వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఇందుకు స్పందించిన జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఆయా సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీరామిరెడ్డి వాటర్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు నాగరాజు, సెక్రటరీ రాముడు, ట్రెజరర్‌ వన్నూరుస్వామి, ఆర్గనైజర్‌ ఎం.నాగరాజు సంయుక్త కార్యదర్శి ప్రభాకర్‌, ఎస్‌.రామాంజనేయులు, అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.