Nov 03,2023 21:44

ఫొటో : మున్సిపల్‌ మేనేజర్‌కు వినతిపత్రం అందజేస్తున్న కార్మికులు

బకాయి జీతాలు వెంటనే ఇవ్వాలి
ప్రజాశక్తి - కావలి రూరల్‌ : కావలి మున్సిపాలిటీలో డైలీ పారిశుధ్య కార్మికులుగా పనులు చేస్తున్న వారికి నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదని వారికి వెంటనే జీతాలు చెల్లించాలని కోరుతూ శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్‌ మేనేజర్‌ షేక్‌ సికిందర్‌కు అర్జీని అందజేశారు. అనంతరం ఆ సంఘ గౌరవ అధ్యక్షులు పి.పెంచలయ్య మాట్లాడుతూ డైలీ కార్మికులకు నాలుగు నెలల నుండి జీతాలు ఇవ్వకపోవడం చాలా అన్యాయమన్నారు. వీరందరూ నిరుపేదలని, నాలుగు నెలల నుండి జీతాలు రాక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రెక్కాడితే గానీ డొక్కాడని కార్మికులకు మున్సిపల్‌ అధికారులు ప్రతినెలా జీతాలు ఇవ్వకుండా ఇలా ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. పనులు చేయించుకుంటూ ప్రతినెలా జీతాలు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేయడం చాలా దుర్మార్గమైన విషయమన్నారు.
అప్పులు తెచ్చుకొని కుటుంబాలు పోషించుకుంటున్నారని, తెచ్చిన అప్పులు తీర్చలేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలు అధికారులు పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కార్మికులకు ఇవ్వాల్సిన నాలుగు నెలల జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో మున్సిపల్‌ కార్యలయం వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి వై.కృష్ణమోహన్‌, డివైఎఫ్‌ఐ నాయకులు పి పెంచల నరసింహ, యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు తురక సీనయ్య, బిడదల మహేష్‌, కార్మికులు పాల్గొన్నారు.