Oct 29,2022 21:28

బియ్యంతో సర్దుకోవాల్సిందేనా..?
నీరుగారుతోన్న ప్రజాపంపిణీ
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి

మార్కెట్లో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలకు కొనుగోలు చేయలేరనే ఉద్దేశంతో పేదల కోసం ప్రజాపంపిణీ వ్యవస్థ వచ్చింది. ఒకప్పుడు మూడు నాలుగు వస్తువులు ఇచ్చే ప్రాంతంలో ఇప్పుడు ప్రభుత్వం కేవలం బియ్యంతో సరిపెడుతోంది. బియ్యం ఒకటి తీసుకుని బతకమని చెబుతున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వస్తువులు కొనుగోలు చేయలేక పేదలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా పండగ పూట కూడా పేదలకు పట్టెడు పప్పన్నం దొరికే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ఈ సారి కూడా పేదలకు కందిపప్పు, చక్కెర వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీపావళికీ వీటిని ప్రభుత్వం అందించిన పాపాన పోలేదు. ఇక నవంబర్‌ నెలలోనూ ఇవి పేదలకు అందే పరిస్థితి లేదని తెలుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం సంక్రాంతికి, దీపావళికి, ఇతర మైనరిటీ పండుగులకు కానుక, తోఫాల పేరుతో సరుకులు పంపిణీ చేసేది. ఇలా చేయలేని పరిస్థితిలో అదనపు కోటా అయినా ఇవ్వాల్సి ఉంది. అరకిలో చక్కెర, కిలో కందిపప్పు అదనంగా ఇవ్వాలి. అదనం కాదు గదా కనీసం నెలనెలా అందించే సరుకులు కూడా ఇవ్వడం లేదు. బయట దుకాణాల్లో ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. కిలో కందిపప్పు ధర.120 నుంచి రూ.130 పలుకుతోంది. అదే చౌకదుకాణంలో అయితే ఇది రూ.60కే దొరికేది. పేదలకు కాస్తయినా పౌష్టికాహారం దొరికేది. ఇదే విధంగా మిగిలిన వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పామాయిల్‌ కొనాలన్నా రూ.140 వరకు వెచ్చించాలి. పేదలను ఈ ధరల భారం నుంచి ఆదుకోవాలంటే చౌకదుకాణాలను బలోపేతం చేసి వాటి ద్వారా సరుకులు ఇవ్వాల్సిన అవసరం ఉంది.