Jul 08,2023 21:57

బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లోకి వాతావరణ బీమా సొమ్మును జమ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోన్‌రెడ్డి

         అనంతపురం ప్రతినిధి : భైరవానితిప్పి ప్రాజెక్టుకు హంద్రీనీవా ద్వారా ఎత్తిపోతల పథకానికి భూసేకరణకు నిధులు మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. 1400 ఎకరాల భూసేకరణకు అవసరమైన రూ.208 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ఆయన అనంతపురం జిల్లాకు విచ్చేశారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి ఉదయం వచ్చారు. అక్కడ సత్యసాయి జిల్లా వైసిపి నాయకులు, కలెక్టర్‌ అరుణ్‌బాబు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం హెలిక్యాప్టర్‌లో కళ్యాణదుర్గంకు చేరుకున్నారు. అక్కడ అనంతపురం జిల్లా వైసిపి ప్రజాప్రతినిధులు, నేతలు స్వాగతం పలికారు. అనంతరం మోడల్‌ స్కూల్‌ వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు విచ్చేశారు. అక్కడ అగ్రిల్యాబ్‌ కేంద్రాలను ప్రారంభించారు. పక్కనే ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో పంటలబీమా రైతు లబ్ధిదారులతో ముఖాముఖి అయ్యారు. అనంతరం వేదికపై వచ్చాక వైఎసార్‌ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్‌ గౌతమి ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రసంగించారు. కళ్యాణదుర్గం, ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాలకు సాగునీటిని అందించే భైరవాని తిప్ప ప్రాజెక్టుకు హంద్రీనీవా ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూసేకరణకు అవసరమైన రూ.208 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కళ్యాణదుర్గంలో అంబేద్కర్‌ భవన్‌, నియోజకవర్గం పరిధిలో షాదీఖానా, లింగయత్‌, తదితర సామాజిక తరగతులకు కమ్యూనిటీ హాళ్లుకు నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని చెప్పారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలోనూ, అనంతపురం జిల్లాలోనూ ఒక్క కరువు మండలం లేదని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సగానికిపైగా మండలాలు కరువు మండలాలున్నాయన్నారు. ప్రకృతి సహకారంతో మంచి పంటలు ఈకాలంలో పండాయని చెప్పారు. అయినా తమ ప్రభుత్వ హయాంలోనే రైతులకు పంటలబీమా అధికంగా వచ్చిందన్నారు. గతంలో ఐదేళ్లలో రూ.3411 కోట్లే బీమా వస్తే ఈ నాలుగేళ్లలో రూ.7802 కోట్లు ఇచ్చామన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా పంటలకు గిట్టుబాటు ధర అందించేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ప్రజలకు మంచిచేస్తే అడ్డుపడుతున్న విపక్షాల మాటలు నమ్మొద్దని సూచించారు. త్వరలో జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలకు మంచి చేసే ప్రభుత్వానికి మద్దతునివ్వాలని కోరారు. దుష్టచతుష్టయాలు మాయమాటలతో మీ ముందు కొస్తున్నాయని పేర్కొన్నారు. అటువంటి వారికి కాకుండా ప్రజలకు మంచిచేసే తమకు అండగా నిలువాలని కోరారు. అనంతరం సభావేదిక నుంచే రాష్ట్ర స్థాయిలో ఖరీఫ్‌ 2022 ఉచిత పంటల బీమా పరిహారాన్ని 10.20 లక్షల మందికి రూ.1117.21 కోట్లను బటన్‌ నొక్కి విడుదల చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1,36,950 మంది అన్నదాతలకు రూ.212.94 కోట్ల మేర పంటల బీమా లబ్ధి చేకూరింది. రూ.63.96 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన 52 డా||వైఎస్‌ఆర్‌ అగ్రిటెస్టింగ్‌ ల్యాబ్‌ భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, వై.శివరామిరెడ్డి, మంగమ్మ, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి, వై.వెంకటరామి రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, జెడ్పీ ఛైర్‌ పర్సన్‌ బోయ గిరిజమ్మ, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ సి.హరికిరణ్‌, జిల్లా కలెక్టర్‌ ఎం.గౌతమి, ఎస్పీ కె.శ్రీనివాసులు, జెసి కేతన్‌గార్గ్‌, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర రెడ్డి, గురునాథ రెడ్డితో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రైతులు, పాల్గొన్నారు.