ప్రజాశక్తి - ఆచంట
కొడమంచిలి బండివారిపాలెంలో రూ.10 లక్షలతో నిర్మించిన బిసి కమ్యూనిటీ హాల్‌ను ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాధరాజు గురువారం ప్రారంభించారు. శ్రీరామనవమి సందర్భంగా ముందుగా కొడమంచిలి బండివారిపాలెంలో సీతారాములను దర్శించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టిడిపి హయాంలో శంకుస్థాపన చేసి వదిలేసిన శెట్టిబలిజ కమ్యూనిటీ హాల్‌ను పూర్తిచేసి ప్రారంభించామన్నారు. బిసిలకు ఎంతో చేసేశాం అంటున్నా గత పాలకులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. బిసిల పక్షపాత నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని స్పష్టం చేశారు. సర్పంచుల ఛాంబర్ మండల అధ్యక్షులు సుంకర సీతారామ్ మాట్లాడుతూ సుమారు 30 ఏళ్ల నుంచి కనీసం ఏ నాయకుడు వచ్చిన, ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. పని త్వరగా పూర్తి అవ్వాలనే ఉద్దేశంతో నేరుగా ఎంఎల్‌ఎ మెటల్, కంకర, ఐరన్, సిమెంట్ బస్తాలు అందించడంతోపాటు సొంతంగా రూ.5 లక్షలు అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా శెట్టిబలిజ సంఘం పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీరంగనాధరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి యాళ్లమెల్లి బేబీ రాజేష్, సొసైటీ అధ్యక్షులు కాండ్రేగుల సత్యనారాయణ, దేవస్థానం అధ్యక్షులు బాలనాగు నరేష్, రైతు సంఘ అధ్యక్షులు మన్నె సుబ్బారావు పాల్గొన్నారు.










