ప్రజాశక్తి -అనంతపురం రాజకీయ పార్టీలు బిసి అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు డాక్టరు పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం పేరుతో బిసిలకు మోసం తప్ప న్యాయం ఎక్కడ జరుగుతోందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అధికారం కోసం పాదయాత్ర లు చేపడుతున్న మీరు, అధికారంలోకి వచ్చాక ఎవరి అభివృద్ధి కోసం పనిచేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు 56 శాతం మంది ఉన్న బిసిల ఓట్ల కోసమే ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇస్తున్నాయన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రతి పదవికి ఒక ధర నిర్ణయించి కులాల మధ్య బేరాలు నిర్ణయిస్తున్నారన్నారు. బీసీ కులాల మధ్య విభేదాలు సృష్టిస్తూ పబ్బం గడుపుతున్నారు. ఈ మోసాలను గమనించాలని రాష్ట్రంలోని బిసి కులాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ రాజకీయ పార్టీల తీరు వల్ల రాష్ట్రంలో చదువుకున్న బిసి యువతకు ఉపాధి అవకాశాలు లేవన్నారు. గౌరవంగా బతకడానికి ఏ ఒక్క అవకాశం లేకుండా చేశారన్నారు. ఇప్పుడు మరోసారి తామే బిసిలకు న్యాయం చేశామని, చేస్తామని పోటీ పడి ప్రకటనలు ఇస్తున్నారన్నారు. బిసి నాయకులు వారి మోచేతి నీళ్లు తాగుతూ ఆ పార్టీల అజెండాతో మాట్లాడుతూ బిసిల నడ్డి విరుస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్కసారి అయినా ముఖ్యమంత్రి పదవిని బీసీలకు కేటాయించాలని, ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 అసెంబ్లీ స్థానాల్లో బిసిలకు అవకాశం ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం రాయలసీమ జిల్లాల ముఖ్య నేతల సమావేశాన్ని ఈ నెల 23న అనంతపురంలో నిర్వహిస్తామని చెప్పారు. మే 14వ తేది ఉత్తర ఆంధ్ర జిల్లాల ముఖ్య నేతల సమావేశం విశాఖపట్నంలో, మే 28వ తేది కోస్తాంధ్ర జిల్లాల ముఖ్యనేతల సమావేశం విజయవాడలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.










