బిందు సేద్యంకు అత్యంత ప్రాధాన్యత
జిల్లాలో 14 వేల హెక్టార్లకు దరఖాస్తులు : జిల్లా ఉద్యానవన అధికారి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందులో ఒకచుక్క నీరు కూడా వధా కాకుండా పంటలకు అందించేందుకు డ్రిప్ ఇరిగేషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఉద్యానవన అధికారి మధుసూదన్ రెడ్డి అన్నారు. సాగునీటి వనరుల సద్వినియోగానికి సంబంధించి గురువారం చిత్తూరులోని మ్యాంగో భవన్‌లో చిత్తూరు డివిజన్‌లోని ఉద్యానశాఖలో గల వీఏఏలు, గ్రామ ఉద్యానవన కార్యదర్శులు, విఎస్‌ఏలు, రైతు భరోసా కేంద్రాల ఇన్‌ఛార్జిలతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే పలువురు రైతులను గుర్తించడం జరిగిందని వారికి పరికరాలను అందించేందుకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని భావించడం జరిగిందన్నారు. అలాగే మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది, ఉద్యానవన సిబ్బంది సహాయంతో క్షేత్రస్థాయిలో వారి లాగిన్‌లో ఈ సర్వే కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సిబ్బందికి తగిన శిక్షణ కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే పలు దరఖాస్తులు రావడం జరిగిందని జిల్లాలో మొదటి విడతలో 9,000 హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్‌కి అనుమతి ఇచ్చి ఉండగా 14వేల హెక్టార్లకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారని క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేసేందుకు పది రోజుల సమయం ఇవ్వడం జరిగిందన్నారు. డ్రిప్ ఇరిగేషన్ కోసం జిల్లాలో 13 కంపెనీలు ఉన్నాయని ఇందుకు సంబంధించి 30మంది ప్రతినిధులు రైతులకు కావాల్సిన సలహాలు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారని సంబంధిత ఉద్యానశాఖ అధికారుల ద్వారా వారిని సంప్రదించవచ్చునని అన్నారు. ఆన్‌లైన్‌లో చేసిన నమోదుకు సంబంధించి జిల్లా ఉద్యానవన అధికారి, జిల్లా కలెక్టర్ అనుమతి పొందిన తరువాత డ్రిప్ వేసుకోవాలన్నారు. ఏ ప్రాంతంలో మొదట సర్వేచేసే సమయంలో వేసుకోవాలని భావిస్తారు అదే పొలంలో వేసుకునే విధంగా చూడాలని దీనికి సంబంధించి ఐదు ఎకరాల లోపు ఉన్న చిన్నకారు రైతులకు 90శాతం సబ్సిడీ రూ.2.18లక్షల వరకు రాయితీ ఉంటుందన్నారు. అలాగే ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు ఉన్న రైతులుకు 70శాతం ఇందులో ఒక్కో రైతు గరిష్టంగా రూ.3.46లక్షల రాయితీ ఉంటుందని జిల్లా ఉద్యానవన అధికారి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో ఉద్యానవన మరియు వ్యవసాయ శాఖకు సంబంధించిన రైతు భరోసా కేంద్ర సిబ్బంది ద్వారా ఎంపిక చేయబడుతుందని వివరించారు. ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా నిజమైన లబ్ధిదారునికి సక్రమంగా ఈ పథకాలు అందేలా చూడాలని కార్యదర్శులను అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపఉద్యానవన అధికారి హరికష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










