May 16,2023 22:10

సమావేశంలో మాట్లాడుతున్న కాంట్రాక్టర్లు

        అనంతపురం కార్పొరేషన్‌ : 'కాంట్రాక్టర్లు కోట్లాది రూపాయలను ఖర్చు చేసి పనులను చేస్తున్నారు.. వాటికి సంబంధించి బిల్లుల చెల్లింపులో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ధైర్యంతో కొంతపనులు చేయాలి' అంటూ కాంట్రాక్టర్లు అనంత కార్పొరేషన్‌ అధికారులను ప్రశ్నించారు. మంగళవారం ఉదయం కార్పొరేషన్‌ కార్యాలయంలో కమిషనర్‌ రమణారెడ్డి ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లతో సమావశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ సోమవారం నాడు నగర అభివృద్ధిపై కలెక్టర్‌ అధ్యక్షతన సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశంలో కాంట్రాక్టర్లపై నమ్మకంతో అభివద్ధి పనులు జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చామన్నారు. పనులను తీసుకున్న కాంట్రాక్టర్లు త్వరితగతిన వాటిని పూర్తి చేయాలన్నారు. దీనిపై కాంట్రాక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ గతంలో జగనన్న లేఅవుట్లకు సంబంధించి గత కలెక్టర్‌ స్వయంగా జారీ చేయగా రూ.50 లక్షల పనులు చేశామన్నారు. రెండేళ్లు కావస్తున్నా వాటికి సంబంధించిన బిల్లులు మంజూరు కాలేదన్నారు. బదిలీపై వెళ్తున్న సందర్భంలో ఆ కలెక్టర్‌ను బిల్లుల విషయమై సంప్రదిస్తే తనకేం సంబంధం లేదని, తాను బదిలీపై వెళ్తున్నానని సమాధానం ఇచ్చారన్నారు. అధికారులు పనులు పూర్తి చేయించడానికి ఒక మాట, బిల్లులు చెల్లించే సమయంలో మరోమాట చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడపగడపకూ మన ప్రభుత్వం కింద రూ.13.5 కోట్లకు టెండర్లు పిలిచారని, ఇందులో రూ.6.15 కోట్లకు మాత్రమే పరిపాలన అనుమతి తీసుకున్నారని చెప్పారు. మిగిలిన రూ.7కోట్లు దేని పరిధిలోకి వస్తాయన్న దానిపై స్పష్టత లేదన్నారు. గ్రాంట్‌ పనులా, లేక జనరల్‌ ఫండ్‌ అన్నా అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలన్నారు. స్పష్టత ఇవ్వకుండా పనులు చేపడితే కాంట్రాక్టర్లు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే తాము చేసిన పనులకు బిల్లులు రాక అవస్థలు పడుతున్నామన్నారు. నగరంలో ఇటీవలి కాలంలో వరదలు వచ్చి ముంపునకు గురైన ప్రాంతాల్లో మానవతా దక్పథంతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాలేదన్నారు. వాటి గురించి పట్టించుకునే నాథుడేలేరని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు కమిషనర్‌ భాగ్యలక్ష్మి చెప్పిన పనులు చేసిన వాటికి కూడా బిల్లులు రాని పరిస్థితి ఉందన్నారు. బిల్లులు రాని ఇలాంటి పరిస్థితుల్లో అభివద్ధి పనులు ఎలా చేపట్టాలని ప్రశ్నించారు. పెండింగ్‌ బిల్లులు అన్నింటినీ తక్షణం కాంట్రాక్టర్లకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బిల్లుల చెల్లింపులో అధికారులు, శాఖల మధ్య సమన్వయలోపం ఉందని, దానిని తక్షనం పరిష్కరించాలన్నారు. లేకుంటే కాంట్రాక్టర్లు ఏపనులు చేయడానికి కూడా ముందుకు రారన్నారు. దీనిపై కమిషనర్‌ రమణారెడ్డి స్పందిస్తూ బిల్లుల చెల్లింపు విషయమై స్వయంగా ఆయా శాఖల అధికారులతో మాట్లాడతానిని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ సతీష్‌చంద్ర, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రామ్మోహన్‌ రెడ్డి, ఇన్‌ఛార్జి ఈఈ చంద్రశేఖర్‌, డిఈలు రాంప్రసాద్‌ రెడ్డి, అసిస్టెంట్‌ ఇంజినీర్లు బాబావలి, శంకర్‌ దాస్‌, రామ్మోహన్‌, కాంట్రాక్టర్లు వేణుగోపాల్‌ రెడ్డి రత్నయ్య, నులక వెంకటేష్‌, ప్రభాకర్‌ రావు, రఘునాథరెడ్డి, సుధాకర్‌, రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.