సబ్సిడీ వర్తించక లక్షల్లో విద్యుత్ బిల్లులు - రొయ్య ధర పతనంతో ఆందోళన
ప్రజాశక్తి - కాళ్ల
ఒకవైపు రొయ్య ధరలు పతనం.. మరోవైపు అధిక విద్యుత్తు బిల్లులతో ఆక్వా రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో రొయ్యలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దీనికితోడు వాతావరణం ఒక్కోసారి ఒకలా మారుతుండడంతో ఎక్కువ మంది రైతులు పట్టుబడులకు సిద్ధమయ్యారు. ఫలితంగా వ్యాపారుల వద్దకు ఇబ్బడి ముబ్బడిగా సరుకు చేరడంతో ధరలను గణనీయంగా తగ్గించేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో రొయ్యల సాగు విస్తీర్ణం
ఉమ్మడి జిల్లాలో 1.2 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. వార్షిక ఉత్పత్తి నాలుగు లక్షల టన్నులు. వార్షిక ఆదాయం రూ.18 వేల కోట్లు. 24 శీతల గిడ్డంగులు ఉన్నాయి. రొయ్యల సాగు లాభాలు పండిస్తోం దంటూ జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా సారవంతమైన భూములను సైతం నిబంధనలకు విరుద్ధంగా రొయ్యల చెరువులుగా మార్చేశారు. ఇప్పటికీ చెరువుల తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రొయ్యల ధరలు పతనం కావడం, వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులతో రొయ్యలు చనిపోతుండడంతో రైతులు తక్కువ కౌంట్‌లో సైతం పట్టుబడులు చేస్తున్నారు. ఒకేసారి పట్టుబడులు ఊపందుకోవడంతో దీన్ని అవకాశంగా తీసుకుని వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు గణనీయంగా తగ్గించేశారని, దీనికి తోడు అధిక విద్యుత్ బిల్లుల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆక్వా రైతుల ఆందోళన చేస్తున్నారు.
అధిక విద్యుత్ బిల్లులు..
జూన్ ఆరంభంలో చేతికొచ్చిన కరెంట్ బిల్లులు చూసి ఆక్వా రైతులకు ముచ్చెమటలు పట్టాయి. ఆక్వా సబ్సిడీ వర్తించకపోవడంతో కరెంటు బిల్లులో నగదు తడిసి మోపెడైంది. కొంతకాలంగా ఆక్వా రైతులకు ఇ-షిప్ నమోదు కాలేదనే సాకుతో విద్యుత్ సబ్సిడీ తొలగించి విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు. గతంలో సబ్సిడీ రూ.10 వేల నుంచి రూ.40 వేలు వచ్చే విద్యుత్ బిల్లులు రూ.80 వేల నుంచి రూ.3.20 లక్షల వరకూ వచ్చాయి. కాళ్ల మండలంలో సుమారు 180 మంది, ఉండి నియోజకవర్గంలో 367 మంది ఆక్వా రైతులకు ఇ-ఫిష్ నమోదు కాకపోవడంతో రైతులకు కోటి రూపాయల వరకూ విద్యుత్ బిల్లు రూపంలో అదనపు భారం పడింది. రొయ్యల రైతులు సరైన గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాల్లో ఉన్నారు. ఇదే సమయంలో అధికారుల తప్పిదం వల్ల సబ్సిడీ వర్తించక పెరిగిన విద్యుత్ ఛార్జీలు రైతుకు గుదిబండగా మరి రోడ్డున పడ్డారు. ఆక్వా రైతులకు ఇ - షిప్ నమోదు చేసి తొలగించిన విద్యుత్ సబ్సిడీలను పునరుద్ధరించాలని తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
వాతావరణం మార్పులు..
మూడు నెలల నుంచి జిల్లాలో ఎండలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. రెండు రోజుల నుంచి మబ్బులు మేఘాలు వర్షాలతో వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. దీని కారణంగా రొయ్యలకు ఆక్సిజన్ అందక చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు.
కొనుగోళ్లు తగ్గాయి..
నాణ్యతలేని రొయ్య పిల్లలు (సీడ్), పెరిగిన మేత ధరలు, విద్యుత్ ఛార్జీల మోత, రొయ్యలకు వివిధ రకాల వ్యాధులు సోకడంతో రైతులు సంక్షోభంలో చిక్కుకుంటున్నారు. వ్యాపారులు కొనుగోళ్లు బాగా తగ్గించడం వల్ల మార్కెట్లో రొయ్య ధర దారుణంగా పతనమైంది. క్షేత్రస్థాయిలో సరైన ధర లభించక నష్టాల సాగు చేస్తున్న రొయ్య సాగుదారులకు తాజాగా విద్యుత్ కోతలతో సతమతమవుతున్నారు. వాతావరణం మారడంతో రొయ్యల చెరువుల్లో ఏరియేటర్లు నిరంతరం తిప్పాల్సిన పరిస్థితి నెలకొంది.
రొయ్యల ధరలు..
రెండు నెలల్లో వంద కౌంట్ వనామీ రొయ్యల ధర కిలో రూ.310 ఉండేది. మొన్నటి వరకూ 250 రూపాయలు. ప్రస్తుతం రూ.180కు దిగజారింది. రొయ్యల సాగు ఖర్చు బాగా పెరిగిపోయింది. రూ.లక్షల నష్టాలతో రొయ్య రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వ్యాపారులు కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లించాలంటే రైతుకు కేజీకి రూ.180 ఇస్తున్నారు. మూడు వారాలు ఆగితే రూ.190 చెల్లిస్తున్నారు. ఆక్వా రైతులు కేజీ రూ.50 నుంచి 60 రూపాయల వరకూ నష్టపోతున్నారు.










