అనంతపురం ప్రతినిధి : ఆర్థిక విధానాలు, మతత్వ విధానాలతో దేశానికి నష్టదాయకంగా మారిన బిజెపిని కేంద్రంలో గద్దెదింపాల్సిందేనని సిపిఎం, సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. సిపిఎం, సిపిఐలు ఈనెల 14వ తేదీ నుంచి చేపట్టిన ప్రచారభేరి కార్యరకమంలో భాగంగా మంగళవారం సాయంత్రం అనంతపురం నగరంలోని పాతూరు బ్రహ్మంగారి గుడి సమీపంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సిపిఎం, సిపిఐ నగర కార్యదర్శులు రామిరెడ్డి, శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబురావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ బిజెపి కేంద్రంలో అధికారంలో తొమ్మిదేళ్ల కాలంలో దేశాన్ని అన్ని విధాలుగా ఆధోగతి పాలుజేస్తోందని విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్‌లకు దోచిపెడుతూ ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. బిజెపి అధికారంలో రాకముందు వరకు దేశం అప్పు 47 లక్షల కోట్లు మాత్రమే ఉండేదని తెలిపారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో దేశం అప్పు రూ.150 లక్షల కోట్లకు చేరిందన్నారు. 70 ఏళ్లలో లేనంత అప్పు ఈ కాలంలో పెరిగిందని పేర్కొన్నారు. దేశ సంపద మొత్తం కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని విమర్శించారు. పేదలపై మాత్రం భారాలు మోపుతూపోతోందన్నారు. మరోవైపు మతత్వ విధానాలను అమలు చేస్తూ ప్రజల మధ్య చీలక తీసుకొస్తోందన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి ఇటీవల హైదరాబాద్ వచ్చిన సమయంలో ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇది ఒక్క ముస్లిం రిజర్వేషన్ తొలగింపుతోనే ఆగదని, బీసీ, ఎస్సీ,ఎస్టీల రిజర్వేషన్లను కూడా క్రమంగా తొలగించాలన్నది బిజెపి లక్ష్యమని విమర్శించారు. మరోమారు అధికారంలోకి వస్తే ఇప్పుడు రాజ్యాంగాన్ని సైతం మార్చివేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మరోమారు బిజెపిని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనూ వైసిపి పాలన అధ్వానంగా ఉందన్నారు. సొంత బాబారు వివేకానంద రెడ్డి హత్య జరిగి ఇన్ని రోజులవుతున్నా దోషులను పట్టుకుని శిక్షించే పనిని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి చేయలేకపోయారని విమర్శించారు. దోషులకు అండగా నిలిచే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పులివెందుల వెళ్లినా... కడప వెళ్లినా... అమరావతి వెళ్లినా... హైదరాబాద్ వెళ్లినా... ఢిల్లీ వెళ్లినా ఎక్కడికెళ్లినా వైఎస్.వివేకానందరెడ్డి హత్యలో ఆ కుటుంబ సభ్యుల పాత్రపైనే మీడియాలో ప్రధాన చర్చ నడుస్తోందన్నారు. ఒకవైపు రాష్ట్రం అప్పుల మయంగా మారిందని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర రుణభారం రూ.10 లక్షల కోట్లకు చేరనుందని తెలిపారు. నెల ఒకటవ తేది వచ్చిందంటే అప్పుల కోసం ఆర్థిక శాఖ మంత్రి చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అప్పుల భారం పెరిగినా అభివృద్ధి ఎక్కడా కనిపించదని విమర్శించారు. నిరుద్యోగం పెరిగిపోతోందన్నారు. దేశంలో సగటు నిరుద్యోగం 17 శాతముంటే రాష్ట్రంలో అది 35 శాతానికిపైగా ఉందని చెప్పారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సాగనంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబురావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పేదలపై పెద్దఎత్తున భారాలు వేస్తోందని విమర్శించారు. పెట్రోల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచేసిందన్నారు. బిజెపి అధికారంలోకి రాకముందు రూ.450 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200లకుపైగా ఉందని గుర్తు చేశారు. పెట్రోల్ కూడా లీటరు రూ.45 నుంచి రూ.110లకుపైగా పెరిగిందన్నారు. ఇంకోవైపు ఆదానీ వంటి సంస్థలకు లాభాలు చేకూర్చడంలో భాగంగా విద్యుత్ ఛార్జీల భారాలు పడుతున్నాయని పేర్కొన్నారు. పేదల ఆదాయాలు ఒకవైపు పడిపోతుంటే కార్పొరేట్ సంస్థల ఆదాయం గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. ఒక్క ఆదానీ ఆదాయమే రూ.50 వేల కోట్ల నుంచి రూ.16 లక్షల కోట్లకు పెరిగిందని గుర్తుచేశారు. తెలుగు ప్రజలందరూ పోరాడి 32మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్న విశాఖ ఉక్కు వంటి ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేయాలని చూస్తోందన్నారు. ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీయడంలో భాగంగా మతత్వాన్ని పెంచిపోషిస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతున్నా ఇక్కడి అధికార వైసిపిగాని, అటు ప్రతిపక్ష టిడిపిగాని ఒక్క మాట బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. విభజన హామీల అమలుపై సైతం పెదవి విప్పడం లేదని దుయ్యబట్టారు. మైనార్టీలకు, వెనుకబడిన తరగతలకు అండగా ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసిపి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని ఇటీవల ప్రకటించిన అంశంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దీనిపై వైసిపి వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఎన్నికల ముందు వరకు ధర్మపోరాట దీక్షలు చేస్తున్నామని చెప్పిన టిడిపి ఇప్పుడు బిజెపి రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై మాత్రం మౌనదీక్ష చేస్తోందని ఎద్దేవా చేశారు. ఇక ప్రశ్నించడానికి వచ్చాను అన్న జనసేన నేత పవన్ కళ్యాణ్ బిజెపిని ప్రశ్నించలేకపోతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై, వారి తరుపున నిలబడి పోరాడేది వామపక్షాలు మాత్రమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు జి.ఓబుళు, సిపిఐ రాష్ట్ర నాయకులు జగదీశ్, సిపిఎం జిల్లా క్యాదర్శి వి.రాంభూపాల్, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఓ.నల్లప్ప, బాలరంగయ్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.










