అనంతపురం కలెక్టరేట్: మహిళా రక్షణకు అడుగడుగునా తూట్లు పోడుస్తూ దేశంలో మతతత్వ హింసను ప్రేరేపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పార్లమెంట్‌లో మద్దతు ఇవ్వడం సిగ్టుచేటని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి విమర్శించారు. సమాజంలో మహిళలపై హింసను వ్యతిరేకిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా పోరుయాత్ర బస్సుజాత గురువారం నాడు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. జూలై 28వ తేదీన శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ప్రారంభం అయిన యాత్ర అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల మీదుగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోకి గురువారం ప్రవేశించింది. అనంతపురం జిల్లాలో తాడిపత్రి, బుక్కరాయ సముద్రం, అనంతపురం, కూడేరు, ఉరవకొండ, గుత్తి, గుంతకల్ ప్రాంతాల్లో జాతా కొనసాగింది. గుంతకల్లు నుంచి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. అనంతపురంలోకి ప్రవేశించిన పోరుయాత్ర జాతాకు మున్సిపల్ కార్మికులు, సిఐటియు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పోరుయాత్రకు నాయకత్వం వహించిన ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రిలకు ఎర్ర కండువాలు కప్పి, పుష్పగుచ్చాలు స్వాగతం పలికారు. అనంతపురం కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఐద్వా జిల్లా కార్యదర్శి రాజేశ్వరి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వ పాలనలో దేశం, రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మణిపూర్ హింసాకాండ ప్రపంచాన్నే కలిచి వేసిందన్నారు. మహిళల్ని నగంగా ఊరేగించి అత్యాచారం, హత్య చేసిన దుర్ఘటన మానవ సమాజానికే మాయని మచ్చఅన్నారు. మణిపూర్‌లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆ రాష్ట్రంలో మారణహోమం జరుగుతున్నా ప్రేక్షకపాత్ర పోషించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి సనాతన ధర్మాన్ని అనుసరించాలని బలవంతంగా సమాజంపై రుద్ధుతోందని తెలిపారు. అదే సనాతన ధర్మాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దేవాలయాలు, విద్యాలయాలకు ఉత్తర్వులు ఇవ్వడం సిగ్గు చేటన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింసను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోనున్నారో చెప్పాలన్నారు. మహిళల్ని నగంగా ఊరేగించి హత్యాకాండకు కారణమైన బిజెపికి జగన్ ప్రభుత్వం మద్ధతు ఇవ్వడం దుర్మార్గంగా ఉందన్నారు. సనాతన ధర్మాన్ని దేవాలయాలు, పాఠశాలలో బోధిస్తామని ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. సనాతన ధర్మవరం అంటే పురుషుడికి స్త్రీ కార్యేసుదాసిగా సేవ చేయాలని బోధిస్తారా..? భర్త చెడ్డవాడైనా సతీసుమతిలా ఉండాలని బోధిస్తారా.? అన్న విషయాలకు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సమాధానం చెప్పాలన్నారు. పాఠశాలలో విభిన్న మతాలకు సంబంధించిన విద్యార్థులకు విభిన్న మత ధర్మాలను సనాతన ధర్మాలుగా బోధిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మతాల్లో స్త్రీలను పురుషుడికి లోబడి ఉండాలనే చెప్పాయని తెలిపారు. వాటిని తిరస్కరించి మనుస్మృతిని కాదని, భారత రాజ్యాంగ చట్టాన్ని చేసుకున్నామని తెలిపారు. ఈ రాజ్యాంగ చట్టం గురించి ఫ్రభుత్వం ప్రచారం చేయాలన్నారు. కులం, మతం, లైంగికత, తేడాలు ఉండరాదని బోధించాల్సిన ఫ్రభుత్వం సనాతన ధర్మాన్ని బోధించాలని చెప్పడం సిగ్గుచేటుగా ఉందన్నారు. సమాజంలో పురుషుడికి మహిళలు లోబడి ఉండాలన్న మనువాదాన్ని, కుల ధర్మమే సనాతన ధర్మమని ప్రచారానికి పూనుకోవడం రాజ్యాంగానికి, భారత చట్టాలకు వ్యతిరేకం అన్నారు. బిల్కిస్ భానుపై అత్యాచారం చేసిన నిందితులను విడుదల చేసిన బిజెపికి వైఎస్‌ఆర్‌సిపి మద్దతు ఇవ్వడం నేరస్తులకు మద్దతు ఇవ్వడమే అన్నారు. రాష్ట్రంలో కూడా ఆడబిడ్డలకు అండగా ఉంటానన్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బిజెపికి మద్దతిస్తూ తప్పు చేస్తున్నారని తెలిపారు. దిశా బిల్లులో ఇచ్చిన వాగ్దానాల మేరకు 21 రోజుల్లో విచారణ చేస్తామన్న మేరకు ఒక అధ్యయన కమిషన్ వేసి నెల రోజుల్లోపు విధి విధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో సిఫార్సులు స్వీకరించి వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి మాట్లాడుతూ పోరుయాత్రకు మహిళలు హాజరై జయప్రదం కోసం సహకరిస్తుండటం అభినందనీయం అన్నారు. ఇదే స్పూర్తితో ఆగస్ట్ 8న విజయవాడలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రమాదేవి, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు నాగమణి, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్యామల, రాజేశ్వరి, ఉపాధ్యక్షురాలు రామాంజినమ్మ ప్రజానాట్య మండలి క్రిష్ణవేణి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం, జిల్లా అధ్యక్షులు ఎటిఎం.నాగరాజు, రాష్ట్ర నాయకురాలు లక్ష్మినరసమ్మ, మంజుల, జ్యోతి, మరియమ్మ, కృపమ్మ తదితరులు పాల్గొన్నారు.










