Aug 03,2022 21:44

బిజెపి విధానాలను ఎండగట్టండి
సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు పిలుపు
ప్రజాశక్తి- పలమనేరు :
దేశంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదాన్ని రోజురోజుకీ వేగంగా అమలు చేస్తున్నారని దీనిపై కేంద్ర కమిటీ ఆగస్టు 1 నుండి 15 వరకు ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని పిలుపునిచ్చిందని సిపిఎం రాష్ట్రనాయకులు దడాల సుబ్బారావు అన్నారు. బుధవారం సిపిఎం పలమనేరు కార్యాలయంలో ముఖ్యకార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దడాల సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ప్రజలపై భారాలు పెంచుతూ మరోవైపు కార్పొరేటర్లకు రాయితీలు ఇస్తుందని విమర్శించారు. దేశంలో మహా ధనవంతులు భారీగా లాభాలు గడిస్తున్నారని తెలిపారు. 7లక్షల కోట్ల రూపాయలు మేరకు మోడీ ప్రభుత్వం వారికి రాయితీలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం కింద వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. దీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉందని అన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో భాగంగా సంపూర్ణ స్వరాజ్యం కోసం తొలత పిలుపునిచ్చింది కమ్యూనిస్టులేనని గుర్తు చేశారు. అయితే మతోన్మాద మోడీ ప్రభుత్వం స్వాతంత్ర కోసం మేమే కషి చేశామని స్వాతంత్రం దినోత్సవం రోజు ఇంటింటి పైన జాతీయ జెండా ఆవిష్కరించమని పిలుపునివ్వడం జరిగిందని, వారికి అర్హత లేదన్నారు. బ్రిటిష్‌ వారికి అనుకూలంగా వ్యవహరించిన ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ దేశభక్తులాగా గొప్పలు చెబుతున్నదని వారికి అర్హత లేదని ధ్వజమెత్తారు. సిపిఎం దేశవ్యాప్తంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా విస్తతమైన ప్రచారం చేయడానికి 15 వరకు దశలవారీగా ఆందోళనకు పిలుపునిచ్చిందని వాటిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ 4న కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమాలు, 8న క్విట్‌ ఇండియా ఉద్యమం సందర్భంగా పోరాట స్ఫూర్తితో నిరసన కార్యక్రమాలు, 11న మండల కేంద్రాల్లో స్కూటర్‌ ర్యాలీలు నిర్వహించి, 14న జరిగే జన జాగరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. అదేవిధంగా ఆగస్టు 15న పార్టీ, ప్రజాసంఘాల కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేసి రాజ్యాంగ పఠనంను ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. సమావేశం కమిటీ సభ్యులు ఈశ్వరయ్య అధ్యక్షత వహించగా ఓబుల్‌ రాజు, జయంతి, ఆంజి, లత, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.