Jul 24,2023 22:01

అనంతపురంలో మౌనప్రదర్శన నిర్వహిస్తున్న పౌరస్పందన నాయకులు

      అనంతపురం కలెక్టరేట్‌ : మణిపూర్‌ రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలు రిజర్వేషన్ల పేరుతో రెండు జాతుల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించడం వల్లే అక్కడ పెద్ద ఎత్తున హింస చెలరేగిందని అనంత పౌర స్పందన వేదిక నాయకులు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ తెలిపారు. మణిపూర్‌లో హింస సంఘటనలు నిర్మూలించి శాంతి నెలకొల్పాలని, ఆ రాష్ట్ర ప్రజలకు సంఘీభావంగా అనంత పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో మౌనప్రదర్శన, మానహారంను సోమవారం నిర్వహించారు. నగరంలోని టవర్‌క్లాక్‌ సర్కిల్‌ నుంచి మౌనప్రదర్శనగా సప్తగిరి సర్కిల్‌ వరకు చేపట్టి అక్కడ మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఇందులో పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు హాజరై మణిపూర్‌ ప్రజలకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌తో పాటు రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ గోవిందరాజులు, పెన్షనర్‌ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శీలా జయరామప్ప, మానవహక్కుల వేదిక ఎస్‌ఎం.బాషా, డాక్టర్‌ వీరభద్రయ్య, సీనియర్‌ పాత్రికేయులు సుసర్ల రమేష్‌, విద్వాన్‌ విశ్వం విజ్ఞాన కేంద్రం జిల్లా కన్వీనర్‌ ఏజీ.రాజమోహన్‌, ఎంఎన్‌టి.రాజు, రెడ్స్‌ భానుజా, కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప, ప్రజా పరిరక్షణ వేదిక బోస్‌, పట్టణ పౌర సంఘాల నాయకులు వి.రామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గేయానంద్‌ మాట్లాడుతూ మణిపూర్‌ సంఘటన మానవ సమాజాన్ని కలిచి వేస్తోందన్నారు. మణిపూర్‌ రాష్ట్రం అల్లర్లు, దాడులతో అట్టుడికి పోతోందన్నారు. ఇంతటి మారణకాండ జరుగుతున్నా అక్కడి ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం నియంత్రించడంలో ఘోరంగా విఫలం చెందాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుకి, మెయితి రెండు వర్గాల మధ్య రిజర్వేషన్‌ సంఘర్షణ వల్ల హింస తలెత్తిందన్నారు. ప్రభుత్వం రిజర్వేషన్‌ సమస్యను పరిష్కరించకుండా ప్రజల మధ్య చిచ్చుపెట్టే చర్యలను చేపట్టిందన్నారు. దీని వల్లే అక్కడ పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంటోందని చెప్పారు. మహిళలను వివస్త్రలను చేసి నగంగా ఊరేగించి గ్యాంగ్‌ రేప్‌ చేయడం, హత్య చేయడం లాంటి ఘటనలు దేశచరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌ ఘటన మానవ, ప్రజాస్వామ్యం హననానికి దారి తీశాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హింసకు కారణమైన ఆ రాష్ట్ర అధికారంలోని బిజెపి ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మహిళా కమిషన్‌నూ బర్తరఫ్‌ చేయాలన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు లెవనెత్తిన మణిపూర్‌ ఘటనపై చర్చ జరిగేలా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అమానవీయమైన సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మణిపూర్‌లో శాంతి నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ఐఎంఎం.మహబూబ్‌బాషా, జమాతే ఇస్లామీ హింద్‌ నాయకులు హాజీపీరా, యాసిర్‌, నవాజ్‌, ఎంపిజె నాయకులు ముస్తఫా, ఫిరోజ్‌, ఐవైఎం రహంతుల్లా, శామీర్‌ సంఘీభావంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్యామల, రాజేశ్వరి, జిల్లా ఉపాధ్యక్షురాలు రామాంజినమ్మ, ప్రజారోగ్య వేదిక కన్వీనర్‌ శ్రీనివాసరావు, కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.బాలరంగయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్‌, శివ, ఆవాజ్‌ జిల్లా అధ్యక్షులు వలి, నగర నాయకులు మసూద్‌, సిఐటియు నాయకులు వెంకటనారాయణ, పట్టణ పౌర సంఘాల నాయకులు ప్రకాష్‌, జెవివి జిల్లా నాయకులు రామిరెడ్డి, పాత్రికేయులు షఫీవుల్లా తదితరులు పాల్గొన్నారు.