ప్రజాశక్తి-ఉరవకొండ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపుదామని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న ప్రచార భేరి కార్యక్రమంలో భాగంగా పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదలకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. ముఖ్యంగా నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి పేదల నడ్డి విరుస్తోందన్నారు. దేశ అభివృద్ధి కన్నా బడా భూస్వాములు, పారిశ్రామికవేత్తల అభివృద్ధే ధ్యేయంగా కేంద్రం పని చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ మధుసూదన్, జిల్లా కార్యవర్గ సభ్యులు రంగారెడ్డి, రైతుసంఘం నాయకులు సీనప్ప, నాగరాజు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మల్లికార్జున, సహాయ కార్యదర్శి మనోహర్, ఉరవకొండ, వజ్రకరూరు మండలాల కార్యదర్శులు తలారి మల్లికార్జున, సుల్తాన్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి సిద్ధార్థ, మహిళా సమాఖ్య నాయకులు వన్నూరమ్మ, నాగలక్ష్మి, సత్తెమ్మ, వామపక్షాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
పుట్లూరు : ప్రజావ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపిని సాగనంపి దేశాన్ని కాపాడుకుందామని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 14 నుంచి 30వ తేదీ వరకు చేపట్టిన ప్రచార భేరి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని బస్టాండ్ సర్కిల్‌లో ఇందుకు సంబంధించిన వాల్‌పోస్లర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి విటి.రామాంజినేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.సూరి, రైతుసంఘం మండల కార్యదర్శి జి.వెంకటచౌదరి మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. మనందరి భవిష్యత్తు కోసం ప్రతి వ్యక్తీ గొంతెత్తి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా రాయలసీమ పట్ల అత్యంత నిర్లక్ష్యం చూపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కె.నాగభూషణం, టి.పెద్దయ్య, పూలరంగడు, నాగమునేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
శింగనమల : ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రచార భేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి నిరంకుశ విధానాలు, దేశ సమైక్యత, సమగ్రత, రాజ్యాంగ విలువల పరిరక్షణకు ప్రజలంతా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 25న జిల్లాకేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి టి.నారాయణస్వామి, ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.చిన్నప్పయాదవ్, మండల కార్యదర్శి టి.రామాంజినేయిలు, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి చిరంజీవి, మండల సహాయ కార్యదర్శులు మధుయాదవ్, ఓబుళపతి, తదితరులు పాల్గొన్నారు.
ఉరవకొండలో ర్యాలీ నిర్వహిస్తున్న వామపక్ష నాయకులు










