అనంతపురం కలెక్టరేట్ : బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని ఆదివారం స్థానిక గణేనాయక్ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ బిజెపి ఒక వైపు మతోన్మాద ఘర్షణలు, మరో వైపు అదానీ, అంబానీ లాంటి అతి సంపన్నులకు దశ సంపదను దోచి పెడుతోందన్నారు. ఈ మతోన్మాద, నిరంకుశ విధానాలను ప్రజలకు వివరించేందుకు సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార భేరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి, ఐక్య పరచాలని సిపిఎం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల సంపదగా ఉన్న బ్యాంకుల్ని, ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని, ఓడరేవుల్ని, అఖరికి వ్యవసాయాన్ని సైతం కార్పొరేట్లకు మోడీ ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందన్నారు. దశంలో అడవులు, భూములను, విద్యుత్ ప్రాజెక్టులు, గనులను అదానీ లాంటి కార్పొరేట్లకు ఆక్రమంగా కట్టబెడుతోందన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తోందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని సైతం మోడీ ప్రభుత్వం అటకెక్కించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందన్నారు. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సిపిఎం శ్రేణులు ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు ప్రజల వద్దకెళ్లి వినాశకర ఆర్థిక, మతత్వ ప్రమాదాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యామ్నాయ ప్రజా అనుకూల విధానాల సాధన కోసం ఉద్యమాలకు ప్రజలను సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, నాయకులు ఓ.నల్లప్ప, ఎం.బాలరంగయ్య, ఎస్.నాగేంద్ర, బి.శ్రీనివాసులు, ఎం.కృష్ణమూర్తి, వి.రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు, రామాంజనేయులు, సూర్యచంద్ర, నాగమణి, నిర్మల, భాస్కర్, అచ్యుత్ తది తరులు పాల్గొన్నారు.










