Apr 20,2023 21:37

సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం
ప్రజాశక్తి - వీరవాసరం
కేంద్రంలో బిజెపి ప్రభుత్వ పాలనలో దేశం అధోగతి పాలైందని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం విమర్శించారు. సిపిఎం, సిపిఐ ప్రచార భేరి యాత్ర ముగింపు సభ ఆ పార్టీ మండల కన్వీనర్‌ పోతుల మృత్యుంజయ అధ్యక్షతన గురువారం నవుడూరు సెంటర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా బి.బలరాం మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ప్రజల సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన అస్త్రలుగా ఉపయోగించి బిజెపి అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే కాంగ్రెస్‌ పాలనకన్నా బిజెపి పాలన దేశాన్ని మరింత దిగజార్చిందన్నారు. నిత్యం పెరుగుతున్న ధరలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరోవైపు కార్మికులు, రైతులు, సామాన్య, మధ్యతరగతి ఉద్యోగులు, ప్రజల హక్కులను కాలరాసేలా చట్టాలు తీసుకొచ్చిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ రైతుల ఆత్మహత్యలు రెట్టింపు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్‌ సేవలో బిజెపి ప్రభుత్వం మునిగిపోయిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా అమలు చేస్తామని చెప్పిన ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వేజోన్‌, కడప ఉక్కు పరిశ్రమ, పోలవరం ప్రాజెక్టు నిధుల విషయాన్ని బిజెపి ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, సిఎం నోరు మెదపడం లేదన్నారు. టిడిపి, జనసేన సైతం కేంద్రం చేస్తున్న అన్యాయంపై కనీసం మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వామపక్షాలు కేంద్రంపై చేస్తున్న ఆందోళనల్లో మిగిలిన పార్టీలూ కలిసి రావాలని బలరాం కోరారు. సిపిఐ జిల్లా నాయకులు మల్లుల సీతారాంప్రసాద్‌ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని తీసుకొచ్చి ప్రతిఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి జన్‌ధన్‌ ఖాతాలు తెరిపించి ఒరగబెట్టిందేమీలేదన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జెఎన్‌వి.గోపాలన్‌ మాట్లాడుతూ ప్రజలపై పెను భారాలు మోపిన బిజెపిని దూరం పెట్టాల్సిన రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఆ పార్టీని తమ భుజాలపై మోయడం సిగ్గు చేటన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపితో జతకట్టే పార్టీలను ప్రజలు దూరం పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జుత్తిగ నరసింహమూర్తి, నేతలు కేతా జ్యోతిబసు, తాళ్లూరి రాము, యండమూరి సుబ్బారావు, పాలా కోటేశ్వరరావు, అయినంపూడి బాబూరావు, యాళ్లబండి నారాయణమూర్తి, లింగం సత్యనారాయణ, తోట నర్సింహరావు, జుత్తిగ సాంబియాంబ, బొంతు రామారావు పాల్గొన్నారు.
తణుకురూరల్‌: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం పిలుపునిచ్చారు. సిపిఎం, సిపిఐ రాజకీయ ప్రచారభేరి ముగింపు సభ గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద జరిగింది. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ ఎన్నికల్లో బిజెపి ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి ప్రజలపై విపరీతమైన భారాలు వేస్తుందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ బిజెపి అధికారం చేపట్టి తొమ్మిదేళ్లయినా నేటికీ ఏఒక్క వాగ్దానమూ అమలు చేయకుండా దేశాన్ని మోడీ అమ్మేస్తున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పివి ప్రతాప్‌, నేత కామన మునిస్వామి, సిపిఐ జిల్లా నేత బొద్దాని నాగరాజు పాల్గొన్నారు.
పెంటపాడు: ఈ నెల 21న తాడేపల్లిగూడెం ఎన్‌కె గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ, సిపిఎం ఆధ్వర్యాన తలపెట్టిన బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి కళింగ లక్ష్మణరావు, సిపిఎం మండల కార్యదర్శి చిర్ల పుల్లారెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు తెలిపారు. గురువారం రెండోరోజు ప్రచారభేరి నిర్వహించారు. యాత్ర పెంటపాడు నుంచి దర్శిపర్రు, వల్లూరుపల్లి, రాచర్ల, అలంపురం, బోడపాడు, బిల్లగుంట, రావిగుంట, జట్లపాలెం, ఉమామహేశ్వరం, మౌంజిపాడు, పడమర విప్పర్రు మీదుగా పెంటపాడు చేరుకుంది. ఈ కార్యక్రమంలో బంకురు నాగేశ్వరరావు, బోడబల్ల లక్ష్మీనారాయణ, మీసాల శ్రీను, సత్తి మహేష్‌ రెడ్డి, దిద్దే నాగేశ్వరరావు, పెనగంటి దుర్గ పాల్గొన్నారు.
నరసాపురం రూరల్‌: ప్రజావ్యతిరేక నిరంకుశ మతోన్మాద బిజెపిని సాగనంపుదాం.. దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో జనం కదలాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. సిపిఎం, సిపిఐ రాజకీయ ప్రచారభేరి యాత్ర తూర్పుతాళ్లు, పెదమైనవానిలంక, చినమైనవానిలంక, వేములదీవి ఈస్టు, వేములదీవి వెస్ట్‌ గ్రామాల మీదుగా సాగింది. వేములదీవి వెస్టులో జరిగిన సభకు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కవురు పెద్దిరాజు అధ్యక్షత వహించగా బలరాం మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రతిఒక్కరూ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. సభలో సిపిఎం నేతలు ముచ్చర్ల త్రిమూర్తులు, మామిడిశెట్టి రామాంజనేయులు, జల్లి రామ్మోహన్‌రావు మాట్లాడారు.
తాడేపల్లిగూడెం: సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార భేరి యాత్ర గురువారం మండలంలోని వెంకట్రావుపాలెం, నీలాద్రిపురం, కొమ్ముగూడెం, పట్టింపాలెం, వీరంపాలెం, బంగారుగూడెం, కొత్తూరు, ఆరుగొలను, నవాబుపాలెం, పెద్దతాడేపల్లి, రామన్నగూడెం, వెంకట రామన్నగూడెం, కృష్ణయ్యపాలెం, ఆరుళ్ల, మారంపల్లి, నందమూరు గ్రామాల్లో సాగింది. పెదతాడేపల్లిలో ఉపాధి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కండెల్లి సోమరాజు, సిపిఐ నాయకులు ఉల్లింకుల జయకృష్ణ మాట్లాడారు. కార్యక్రమంలో కండెల్లి రమేష్‌బాబు, ఉల్లింకల బాలకృష్ణ పాల్గొన్నారు.
పెనుగొండ: సిపిఎం ఆధ్వర్యంలో పెనుగొండ ఇందిరాకాలనీలో ప్రచార భేరి నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నేత షేక్‌ పాదుషా మాట్లాడగా మాదాసు నాగేశ్వరరావు, శీలం ఏసు, గెద్దాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపిని సాగనంపుదాం.. దేశాన్ని కాపాడుకుందామనే నినాదంతో పట్టణంలో గురువారం వరుసగా ఏడో రోజు సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార భేరి యాత్ర ఎస్‌వి.రంగారావు విగ్రహం వద్ద నుంచి తాళ్లముదునూరుపాడు వరకు మెయిన్‌ రోడ్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, సిపిఎం పట్టణ నాయకులు కరెడ్ల రామకృష్ణ మాట్లాడుతూ బిజెపి విధానాలను నిరసిస్తూ శుక్రవారం తాడేపల్లిగూడెంలో పట్టణంలో నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జవ్వాది శివ, తోట శ్రీను, షేక్‌ సాయిబన్‌, శిద్దిరెడ్డి శేషుబాబు, చిట్టేటి సత్యనారాయణ, పోతు శ్రీను, అల్లం రాము, దాస్యం రాము, రావూరి బాబీ, కోరాడ వెంకటేశ్వరరావు, ఉయ్యూరి సత్యనారాయణ పాల్గొన్నారు.
భీమవరం: యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరావు అన్నారు. సిపిఎం, సిపిఐ ప్రచార భేరి పట్టణంలో గురువారం కొనసాగింది. ఈ సందర్భంగా వాసుదేవరావు, పట్టణ నాయకులు ఎం.వైకుంఠరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో దేశాన్ని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దివాలా తీయించిందని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు డి.నాగు, కె.కృష్ణ, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, డి.త్రిమూర్తులు, కోదండం శ్రీరాములు, నాగేశ్వరరావు, అంజి, వెంకన్న పాల్గొన్నారు.
పెనుమంట్ర: ప్రజలకు శాపంగా మారిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలను అంతా వ్యతిరేకించాలని సిపిఎం మండల కార్యదర్శి కూసంపూడి సుబ్బరాజు అన్నారు. గురువారం జుత్తిగలో ప్రచార భేరి నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడగా నేతలు మేకపాటి సుబ్బారావు, కర్రి సోమిరెడ్డి, కర్రి సత్యనారాయణరెడ్డి, కొడమంచిలి సాయి, తమనంపూడి సోమిరెడ్డి, పట్నాల భాస్కరరావు, దంపనబోయిన చిరంజీవి, మిర్యాల సూర్యారావు పాల్గొన్నారు.