Apr 16,2023 08:24

అనంతలో నిరసన ర్యాలీ చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య వేదిక జెఎసి నాయకులు

         అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం కార్పొరేషన్‌ అధికారులపై బిజెపి నేతల నోటి దురుసు, దాడిపై జిల్లా వ్యాప్తంగా సర్వత్రా నిససనాగ్రహం పెల్లుబికింది. కార్పొరేషన్‌ కార్యాలయంలోకి వెళ్లి విధి నిర్వహణలో ఉన్న ఓ అధికారిని ఏకంగా 'బట్టలూడదీసి కొడతా' అంటూ బిజెపి నేతల బరితెగింపు వ్యాఖ్యలను అందరూ మక్తకంఠంతో ఖండించారు. అనంతపురం కార్పొరేషన్‌లో అధికారులను దూషించిన బిజెపి నాయకులపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఐక్య ఉద్యోగ, ఉపాధ్యాయ జెఎసి ఆధ్వర్యంలో శనివారం ఉదయం కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. భారీ ర్యాలీతో డీఎస్పీ కార్యాలయం వద్దకెళ్లి అక్కడ బైటాయించి ధర్నా చేపట్టారు. వీరి ఆందోళనలకు సిఐటియు, పలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. సందర్భంగా జిల్లా ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్లాస్టిక్‌ నిషేధ చట్టాన్ని అమలు చేస్తున్న అనంతపురం నగర పాలక సంస్థ అధికారులను బిజెపి నాయకులు లలిత్‌కుమార్‌, ఫయాజ్‌లు బూతులు తిట్టడం దుర్మార్గం అన్నారు. చట్టాన్ని అమలు చేసే అధికారులను గుడ్డలూడదీసి కొడతామంటూ మాట్లాడిన తీరు సభ్యసమాజం తలదించుకునేదిలా ఉందన్నారు. ఓ వైపు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌ను నిషేధం విధించాలని చట్టం చేస్తుండగా, దానిని అమలు చేసేందకు వెళ్తున్న అధికారులపై బిజెపి నాయకులు దూషనలు దాడలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతపురంలో స్థానిక బిజెపి నేతలు నిషేధం విధించిన ప్లాస్టిక్‌ వస్తువులను అమ్ముతున్న వ్యాపారులతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నట్లు వారి చర్యలను బట్టి స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. ఏకంగా కార్యాలయంలోనూ అధికారులను దూషిస్తున్నారంటే బిజెపి నాయకులకు చట్టం, అధికార యంత్రాంగంపై ఎలాంటి చిత్త శుద్ధి ఉందో అర్థం అవుతోందన్నారు. అధికారులపై అనుచితంగా ప్రవర్తించిన బిజెపి నాయకులపై తక్షణం కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే అధికారుల పక్షాన ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో 4వ పట్టణ సిఐ జాకీర్‌ హుస్సేన్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అధికారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో జెఎసి నాయకులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర రెండవ కార్యదర్శి ఆర్‌వి.నాయుడు, సిఐటియు నగర కార్యదర్శి వెంకట నారాయణ, మూర్తుజా, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు, ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా కార్యదర్శి డి.చంద్రమోహన్‌, జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్‌, జిల్లా కోశాధికారి బషీర్‌ అహ్మద్‌, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌, సిటీ అధ్యక్ష, కార్యదర్శులు మనోహర్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు, నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ కోగటం విజయభాస్కర్‌ రెడ్డి, ఉద్యోగులు సంగం శ్రీనివాసులు, సతీష్‌, యుగంధర్‌ రెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి, శ్రీకాంత్‌, వేణుగోపాల్‌, మురళి,గంగాధర్‌ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉద్యోగులపై అనుచితంగా ప్రవర్తిస్తే ఉపేక్షించం : మేయర్‌
        నగర పాలక సంస్థ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి నేతల చర్యలను ఉపేక్షించేది లేదని, దీనిపై పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని మేయర్‌ మొహమ్మద్‌ వసీం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం నాడు డీఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపార. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్‌ కార్యాలయంలో అధికారులపై బిజెపి నాయకులు ప్రవర్తించిన తీరు ఆక్షేపనీయం అన్నారు. ప్రజలు, నగర అభివద్ది కోసం అధికారులు పని చేస్తున్నారన్న విషయాన్ని బిజెపి నాయకులు గుర్తించాలని చెప్పారు. ఉద్యోగుల పనితీరుపై ఏదైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలే కానీ, ఇలా వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. నగర పాలక సంస్థ ఉద్యోగులు పారదర్శకంగా పనిచేసేందుకు తమ పాలక వర్గం పూర్తి స్వేచ్ఛను ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్‌ కార్యదర్శి సంగం శ్రీనివాసులు, హెల్త్‌ ఆఫీసర్‌ గంగాధర్‌ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్‌ సతీష్‌ కుమార్‌, కార్పొరేటర్లు అనిల్‌ కుమార్‌ రెడ్డి, ఇషాక్‌, కమల భూషణ్‌ తదితరులు పాల్గొన్నారు.
బిజెపి నాయకులను అరెస్టు చేయండి : సిపిఎం
         అనంతపురం మున్సిపల్‌ అధికారులపై దౌర్జన్యం చేసి బెదిరింపులకు దిగిన బిజెపి నాయకులను తక్షణం అరెస్ట్‌ చేయాలని సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం గణేనాయక్‌ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు రోజుల క్రితం అనంతపురం మున్సిపల్‌ కార్యాలయ అధికారిని కొంత మంది బిజెపి నాయకులు ఇష్టారీతిన మాట్లాడారన్నారు. బట్టలూడదీసి తంతామని బూతులు తిట్టడాన్ని సిపిఎం ఖండిస్తోందన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్ధేశంతో మున్సిపల్‌ అధికారులు అనంతపురంలో ప్లాస్టిక్‌ వస్తువులను సీజ్‌ చేశారన్నారు. షాప్‌ యజమానులు టన్నులకొద్ది ప్లాస్టిక్‌ కవర్‌లను షాపులలో పెట్టుకొని అమ్ముతుండడంతో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌, మున్సిపల్‌ అధికారులు, పోలీసుల సహాయంతో ఆయా షాపులపై దాడి చేసి సీజ్‌ చేశారన్నారు. దీనిపై నగరంలో ఉన్న బిజెపి నాయకులు ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం తగదన్నారు. ఇప్పటికే దేశంలో మతాలను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకునే బిజెపి ప్రశాంతంగా ఉన్న అనంతపురం నగరంలో కూడా ఆ విధంగా ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే విధంగా కుట్రలు చేయడం దుర్మార్గం అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలను రగిల్చే ఇలాంట్రి కుట్రలను సిపిఎం ఆధ్వర్యంలో అడ్డుకుంటామని చెప్పారు. అధికారులపై దాడి చేసిన బిజెపి నాయకులు లలిత్‌కుమార్‌, ఫయాజ్‌లపై వెంటనే చట్ట పరమైన కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు వలీ, మసూద్‌, వెంకటేష్‌, నరసింహారెడ్డి, శ్రీనివాసులు, పుల్లన్న, ఎర్రిస్వామి పాల్గొన్నారు.