Jun 07,2023 22:39

అక్రమంగా మట్టి తరలింపు చేస్తున్న ప్రాంతం ఇదే..

        బుక్కరాయసముద్రం : బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల్లో మట్టిని తరలించి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలే ఈ మట్టి దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు సర్వత్రా విన్పిస్తున్నాయి. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన స్థలంలో ఇటీవల అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుని అనుచరుడు, లీజుదారుడు మట్టిని జెసిబిలు, ట్రాక్టర్లతో తరలిస్తున్నట్లు తెలుస్తోంది. బహిరంగంగానే ఈ మట్టి దోపిడీ జరుగుతున్నా రెవెన్యూ, సంబంధిత గిరిజన గురుకుల పాఠశాల అధికారులు మౌనంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. బుక్కరాయసముద్రం మండల కేంద్రం సర్వే నంబరు 396-7 సమీపాన గిరిజన సంక్షేమ శాఖకు చెందిన గురుకుల పాఠశాల నిర్మాణానికి 5 ఎకరాలకు పైగా స్థలాన్ని ప్రభుత్వం కేటాయించి స్వాధీనం చేసింది. ప్రభుత్వం నిధులు సకాలంలో ఇవ్వకపోవడంతో ఈ స్థలంలో నిర్మాణ పనులు మొదలు కాలేదు. ఇదే అదునుగా అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుని అనుచరుడుగా ఉన్న వ్యక్తి గ్రావెల్‌ కోసం స్కూల్‌ స్థలంకు ఎసరు పెట్టేందుకు పథకం రచించారు. మట్టి తరలించేందుకు అనుమతులు పేరుతో గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల కోసం కేటాయించిన స్థలంలో పట్టపగలే తన సొంత జెసిబితో మట్టిని తవ్వి అమ్మకాలు చేస్తున్నాడు. ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతి పొందిన స్థలంలో కాకుండా గిరిజన గురుకుల పాఠశాలకు సంబంధించిన స్థలంలో మట్టిని తవ్వుతూ అక్రమంగా తరలిస్తున్నా అధికారులు నోరుమెదపడం లేదు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన స్థలాలను నాశనం చేసి ఇలా మట్టి తరలించుకుపోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బుక్కరాయసముద్రం గ్రామంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని, వాటిని రక్షించేలా బోర్డులు ఏర్పాటు చేయాలంటూ తరచూ పత్రికల్లో కథనాలు వస్తున్నా, ప్రజాసంఘాల నేతలు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారన్న దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా మండల రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు స్పందించి వారి స్థలం జరుగుతున్న అక్రమ మట్టి రవాణాని నియంత్రించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.