Sep 22,2022 21:57

బీజేపీ నుంచి దేశాన్ని రక్షించుకుందాం
సిపిఎం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ
ప్రజాశక్తి- పలమనేరు:

కేంద్రంలోని బిజెపి నుంచి దేశాన్ని రక్షించు కునేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాల్సిన అవసరం వచ్చిందనిసిపిఎం పట్టణ కార్యదర్శి గిరిధర్‌ గుప్తా అన్నారు. గురువారం సిపిఎం జాతీయ కమిటీ పిలుపుమేరకు దేశరక్షణ భేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలను ప్రజలకు వివరించారు. ఎనిమిదేళ్ల బిజెపి పాలనలో దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు చుక్కల ఆకాశాన్నంటాయని, అన్ని వస్తువులపై జిఎస్‌టి పేరుతో ప్రజలపై భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఓబుల్‌ రాజు మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలైన రైల్వే, ఎల్‌ఐసి, బ్యాంకులు, బిఎస్‌ఎన్‌ఎల్‌తో సహాఅన్నింటినీ ప్రైవేటీకరించి కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, జిఎస్టి భారీగా పెంచిందని, ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేయడమే కాకుండా నిరుద్యోగాన్ని పెంచుతోందన్నారు. బిజెపి అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం సెప్టెంబరు 14 నుండి 27వ తేదీ వరకు దేశరక్షణ భేరి నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ర్యాలీలో బిల్డింగ్‌ కార్యదర్శి ఆంజనేయులు లక్ష్మయ్య, రాజా, జానకిరాము, శ్రీరామయ్య, బాబు, వాసు, జయంతి, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.