Jul 29,2023 22:20

బిఇఎల్‌ ఛైర్మన్‌ శ్రీవాత్సవతో మెట్టు గోవిందరెడ్డి

           రాయదుర్గం : భారత్‌ ఎల్రక్టానిక్స్‌ లిమిటెడ్‌ (బిఇఎల్‌) బెంగళూరులో శనివారం ఏర్పాటు చేసిన విందులో ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవింద రెడ్డి పాల్గొన్నారు. బిఈఎల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ భాను పి.శ్రీవాత్సవతో ఆయన మాట్లాడారు. వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి నేతత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా శరవేగంగా అడుగులు ముందుకు వేస్తోందన్నారు. ఓ వైపు పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, మరో వైపు సెజ్‌ (స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌)లు, వాటిలో భారీ పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్ద 914 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగానికి చెందిన భారత్‌ ఎల్రక్టానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ కాంప్లెక్స్‌ పనులు వేగం జరుగుతున్నాయని చెప్పారు. ఐదు దశల్లో ఈ యూనిట్‌ను అభివద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే తొలి దశలో రూ.384 కోట్లతో అభివద్ధికి బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. ఆగస్టు నెలలో పాలసముద్రంలో బీఈఎల్‌ సందర్శించి పనులను మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతుందన్నారు. అక్టోబర్‌ నెలలో పనులు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో బీఈఎల్‌ డైరెక్టర్లు పార్థసారథి, వినరు కుమార్‌, మనోజ్‌ జైన్‌, దామోదర్‌, విక్రమాన్‌, కెవి.సురేష్‌ కుమార్‌, శివనాద్‌ యాదవ్‌, సంతోష్‌ కుమార్‌, శ్యామ సింగ్‌, ప్రఫుల్ల కుమార్‌ చౌదరి పాల్గొన్నారు.