ప్రజాశక్తి-కదిరి అర్బన్: పనికి తగ్గ ఫలితం అందక కుటుంబ పోషణ భారమైన బీడీ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ్య చర్యలు చేపట్టాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం స్థానిక సిఐటియు నాయకులతో కలిసి పట్టణంలోని వలిసాబ్ రోడ్, నిజాం వలి కాలనీల్లో పర్యటించి బీడీ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు పలు సమస్యలను ఆయనకు వివరించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఇందులో పని చేస్తున్నా కుటుంబానికి మూడు పూటలా తినడానికి అన్నం పెట్టలేక అప్పుల పాలవుతున్నామన్నారు. అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నామన్నారు. ఆరోగ్యాలు పాడవుతున్నా ప్రభుత్వం గానీ, బీడీ యజమానులు గాని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా కూలి అంతంత మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం బీడీ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. అనంతరం ఓబులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ కార్మికుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు. పట్టణంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, ఇల్లు కట్టించాలని, చదువుతున్న పిల్లలకు ప్రత్యేక స్కాలర్‌షిప్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట నిర్వహిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐటియు నాయకులు తాజుద్దీన్, రామ్మోహన్, జిఎల్ నరసింహులు, ముస్తాక్, బాబ్‌జాన్, ఫాజిల్, తదితరులు పాల్గొన్నారు.










