Aug 07,2023 21:49

బీడీ కార్మికులకు గతంలో కేటాయించిన స్థలాలన పరిశీలిస్తున్న ఎపి బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులు

           ప్రజాశక్తి-తాడిపత్రి    పట్టణంలోని బీడీ కార్మికులకు ఇళ్లపట్టాలు వెంటనే కేటాయించాలని ఎపి బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులు డిమాం డ్‌ చేశారు. సోమవారం గతంలో పట్టణ శివారులో బీడీ కార్మికులకు కేటాయించిన స్థలాలు పరిశీలించారు. అనంతరం పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఎపి బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో వేలాదిమంది బీడీ కార్మికులు తీవ్ర దుర్బర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారన్నారు. అలాంటి కార్మికులకు ఇంతవరకూ ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం దారుణమన్నారు. గతంలో స్టీల్‌ప్లాంట్‌ దగ్గర, ఆటోనగర్‌ దగ్గర ఇచ్చిన స్థలాల్లో పలు సమస్యలు ఉన్నాయన్నారు. బీడీ కార్మికులకు స్థలాలు ఇవ్వాలని దాదాపు 300 అర్జీలు ఇచ్చినప్పటికీ ఎలాంటి సర్వే చేయకపోవడం బాధాకరమన్నారు. తక్షణం బీడీ కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం బీడీ కార్మికులతో కలిసి తహశీల్దార్‌ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. తర్వాత తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఏపీ బీడీ, సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా షర్మిల, కార్యదర్శిగా ఉమాగౌడ్‌, కోశాధికారిగా కౌసర్‌, కమిటీ సభ్యులు పర్వీన్‌, గౌసియా, నూరి, మాబుజాన్‌, ఎస్‌.గౌసియాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే పాతకోట కో ఆప్షన్‌ సభ్యులుగా ఇద్దరిని, గాంధీనగర్‌ కోఆప్షన్‌ సభ్యులుగా ముగ్గురు, కాలుగడ్డివీధి కో ఆప్షన్‌ సభ్యులుగా ముగ్గురు, ఆసుపత్రి పాలెం కోఆప్షన్‌ సభ్యులుగా ఇద్దరు, గోపాల్‌ రెడ్డి కాలనీ కోఆప్షన్‌ సభ్యులుగా ఇద్దరు, యాడికి కో ఆప్షన్‌ సభ్యులుగా ఇద్దరూ , ఎల్లనూరు మండలం కో ఆప్షన్‌ సభ్యులుగా ఇద్దరిని ఎంపిక చేయాలని నిర్ణయించారు.