Mar 25,2023 22:24

ఉపాధ్యాయునిగా, నటునిగా, అభ్యుదయవాదిగా, గ్రామపెద్దగా సేవలు అమోఘం
నేడు వేండ్రలో నరసింహమూర్తి సంస్మరణ సభ
నాన్న ఆశయాలు కొనసాగిస్తాం : నరసింహమూర్తి కుటుంబ సభ్యులు
ప్రజాశక్తి - పాలకోడేరు

             ఉపాధ్యాయునిగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి.. నటుడిగా కళారంగంలో నవరసాలు పండించి.. అభ్యుదయ భావాలతో సమాజంలోని రుగ్మతల తొలగింపునకు కృషి అందించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా అందరి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి వేండ్ర గ్రామానికి చెందిన యల్లమిల్లి నరసింహమూర్తి. యుటిఎఫ్‌ నేతగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ముందుండి, సిపిఎం నాయకునిగా కార్మికులకు అండగా ఉండి, గ్రామంలో ఏ ఇబ్బంది వచ్చినా పరిష్కారం మార్గం చూపుతూ సమస్యలను సున్నితంగా పరిష్కరించడంలో యల్లమిల్లికి ఎవరూ సాటిలేరని ఆ గ్రామస్తులు చెబుతుండటం విశేషం. భౌతికంగా నరసింహమూర్తి మన మధ్య లేకపోయినప్పటికీ వివిధ రంగాలకు, సమాజానికి, గ్రామానికి అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని పలువురు చెబుతుండటం ఆయన ప్రత్యేకతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
వేండ్ర గ్రామానికి చెందిన యల్లమిల్లి నరసింహమూర్తిది (86 ) అతి సామాన్య కుటుంబం. ఆ గ్రామంలో 1938 జనవరి ఒకటో తేదీన యల్లమిల్లి సూరయ్య, చిట్టెమ్మ దంపతుల ఏకైక కుమారుడు నరసింహమూర్తి. ప్రాథమిక విద్య వేండ్ర ప్రాథమిక పాఠశాలలో, సెంకండరీ విద్య పాలకోడేరు హైస్కూల్‌లో అభ్యసించారు. అయితే నాటి నుంచి నరసింహమూర్తికి కళలపై మక్కువ ఏర్పడింది. ఏడో తరగతిలోనే ఇంగ్లీషు నాటికతో నరసింహమూర్తి కళారంగంలో అడుగుపెట్టారు. 1959లో సెకండరీ విద్యను పూర్తి చేసిన తర్వాత గణపవరం మండలం దేవర గోపవరం గ్రామానికి చెందిన కొప్పిశెట్టి వెంకన్న, సుబ్బమ్మ దంపతుల కుమార్తె సత్యవతిని వివాహం చేసుకున్నారు. 1960-62లో ఉపాధ్యాయ వృత్తి శిక్షణ పూర్తి చేసి 1964 ఏప్రిల్‌ 4న ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరారు. ముళ్లపర్రు, వేల్పూరు, తోలేరు ఉత్తరపాలెం, గూట్లపాడు, కట్టావారిపాలెం పాఠశాలల్లో ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ క్రమశిక్షణతో బాధ్యతగా ఎందరో విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్ది మంచి ఉపాధ్యాయునిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. నరసింహమూర్తి దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. వారు అచ్యుత సూర్య సుబ్రహ్మణ్యం, సూర్యనారాయణమూర్తి (వైఎస్‌ఎన్‌.మూర్తి), సత్యనారాయణ, శ్రీనివాసరావు, వెంకటలక్ష్మి. వీరిని ఉన్నత చదువులు చదివించి భవిష్యత్తుకు బంగారు బాట వేశారు. వైఎస్‌ఎన్‌.మూర్తి డెల్టా పేపర్‌ మిల్లులో పని చేస్తున్న సమయంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి మిల్లు యాజమాన్యం కార్మికుల పట్ల అవలంబించిన విధానాలపై నికరంగా పోరాడారు. ప్రస్తుతం సిఐటియు మండల కార్యదర్శిగా, సిపిఎం మండల నాయకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నరసింహమూర్తి మిగిలిన కుమారులు వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇటీవల నరసింహమూర్తి అనారోగ్యానికి గురికావడం, ఆపై వృద్ధాప్యం వెంటాడటంతో ఈ నెల 12న తుదిశ్వాస విడిచారు.
నటునిగా నరసింహమూర్తి
చిన్న వయస్సు నుంచే కళారంగంపై మక్కువ పెంచుకున్న నరసింహమూర్తి అటువైపు అడుగులు వేసి నటునిగా మంచి గుర్తింపు పొందారు. ఏడో తరగతి చదువుతుండగానే ఇంగ్లీషు నాటకంలో నటించిన నరసింహమూర్తి ఉపాధ్యాయునిగా పని చేస్తూ అనేక నాటకాల్లో పాత్రలకు తగ్గట్టుగా నటించి ప్రేక్షకులను అలరించి ఆలోచింపజేసేవారు. నరసింహమూర్తి నటించిన తిండి దొంగలు, గొడ్లకాడ, నిర్ణయ నాటికలు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చాయి. నవ్య కళానికేతన్‌ వ్యవస్థాపకులు, నిర్మాత, మాజీ ఎంపీ భూపతిరాజు విజరుకుమార్‌రాజు ఆధ్వర్యంలో అనేక నాటకాలు ప్రదర్శించారు. రైల్వే ఉద్యోగి ఐవి.రావు దర్శకత్వంలో దొంగ రాముడు, ఛైర్మన్‌ నాటికలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. దొంగవీరుడు, పట్టాలు తప్పిన బండి, ఆడది, చీడపురుగులు వంటి నాటికలు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. కళాపరిషత్‌ ఆధ్వర్యంలో పరిషత్తుల్లో హైదరాబాద్‌, తిరుపతి, బళ్లారితో పలు పట్టణాల్లో ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఎన్నో నాటకాలకు నిర్మాతగా వ్యవహరించారు.
యుటిఎఫ్‌ నేతగా పోరుబాటలో..
యుటిఎఫ్‌ ఆవిర్భావం నుంచి నరసింహమూర్తి యుటిఎఫ్‌ నేతగా అటు విద్యారంగ పరిరక్షణతోపాటు ఇటు ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడారు. విస్సాకోడేరు సమితిగా ఉన్నప్పుడు ఆయన సాగించిన పోరాటాలు మరువలేమని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం నేతలు తెలిపారు. ఒకపక్క ఉపాధ్యాయునిగా పని చేస్తూనే మరోపక్క ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో తనదైన శైలితో ముందుకు సాగేవారు. యుటిఎఫ్‌ నాయకుడిగా తోటి ఉపాధ్యాయులను ఏకతాటిపై నడిపించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
ప్రజలను చైతన్యపర్చడంలో ఆయనకు ఆయనే సాటి
నరసింహమూర్తి చిన్ననాటి నుంచి అభ్యుదయ భావాలు కలిగి ఉండటంతో సమాజంలో జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకున్నారు. సిపిఎం సానుభూతిపరునిగా ఉంటూనే నాయకత్వ లక్షణాలను అలవర్చుకుని కార్మికులకు అండగా నిలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందించేవారు. గ్రామంలో వివిధ సందర్భాల్లో మైక్‌ పట్టుకుని ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, సమాజంలో నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు, సామాజిక అంశాలను జోడించి గ్రామస్తులకు అవగాహన కల్పించి వారిని చైతన్యపర్చడంలో కీలక భూమిక పోషించేవారు.
గ్రామానికి పెద్ద దిక్కుగా..
గ్రామంలో ఏ సమస్య ఏర్పడినా దాని పరిష్కారానికి గ్రామస్తులంతా నరసింహమూర్తి దగ్గరికి వచ్చేవారు. ఎటువంటి పెద్ద గొడవైనైనా అతి సున్నితంగా ఇరువురికి నచ్చజెప్పి సమస్య పరిష్కారానికి మార్గం చూపడం ఆయన పెద్దరికానికి నిదర్శనంగా చెప్పొచ్చు. కులమతాలకు అతీతంగా ఇరుపక్షాలను సముదాయించి మనమంతా ఒకటే అనే భావన అందరిలో తీసుకురావడంలో ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. ఎటువంటి సమస్యనైనా సామరస్యంగా వినాయకుడి గుడి వద్ద కూర్చుని పరిష్కరించేవారని గ్రామస్తులు చెబుతున్నారు. నరసింహమూర్తి అంటే చిన్నారులకు సైతం సుపరిచితమే.
నాన్న ఆశయాలు కొనసాగిస్తాం
నరసింహమూర్తి కుటుంబ సభ్యులు
నాన్న తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి నిరంతరం శ్రమించారని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని నరసింహమూర్తి కుటుంబ సభ్యులు తెలిపారు. విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని, భవిష్యత్తులో ప్రతిఒక్కరికీ ఇవి అందేవిధంగా ఆలోచన చేస్తామన్నారు. ముఖ్యంగా గ్రామంలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నామని చెప్పారు. గ్రామస్తులు నాన్న మీద పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా కుటుంబ సభ్యులమంతా ముందుకు సాగుతామన్నారు. ఆయన ఆశ సాధనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
నేడు వేండ్రలో సంస్మరణ సభ
ఉపాధ్యాయ నేత, సిపిఎం నాయకులు యల్లమిల్లి నరసింహమూర్తి సంస్మరణ సభ ఆదివారం వేండ్రలో నిర్వహించనున్నట్లు సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌.అసిరియ్య తెలిపారు. నరసింహమూర్తి స్వగృహం వద్ద జరిగే సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్‌, యుటిఎఫ్‌, సిపిఎం నేతలు, వివిధ పార్టీల ప్రతినిధులు, గ్రామపెద్దలు పాల్గొంటారని పేర్కొన్నారు.