బహుళరంగ ప్రఖ్యాతులు.. అనంతశయనం అయ్యంగార్
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి : విద్యావేత్తగా.. రాజకీయ నాయకునిగా.. స్వాతంత్ర సమరయోధునిగా.. సంఘసంస్కర్తగా.. పేరు గడిచిన మాజీ లోక్‌సభ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ 1991 ఫిబ్రవరి 4వ తేదీన ఉమ్మడి చిత్తూరుజిల్లాలో తిరుపతి సమీపంలోని తిరుచానూరులో జన్మించారు. మున్సిపల్ కౌన్సిలర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన రెండు పదుల వయసులోపే గాంధీజీ పిలుపు అందుకని స్వాతంత్ర పోరాటంలోకి దూకారు. స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో మొదటి రెండు లోకసభల్లో రెండవ లోక్ సభ స్పీకర్‌గా పనిచేసిన ఘనత దక్కించుకున్నారు.
60ఏళ్ల పాటు ప్రముఖ పార్లమెంటేరియన్‌గా మేధావిగా జాతీయస్థాయిలో ప్రసిద్ధికెక్కారు. ఆయన విద్యాభ్యాసం తిరుపతిలోనే సాగింది. 1913లో మద్రాసు పచ్చయప్పసు కాలేజీ నుంచి బిఏ పట్టభద్రులయ్యారు. అనంతరం మద్రాసు యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. గణితశాస్త్ర ఉపాధ్యాయునిగా వత్తిని ప్రారంభించిన ఆయన అతిత్వరగా న్యాయవాద వత్తిలో స్థిరపడ్డారు. దాన్ని వత్తిగా కాకుండా సమాజానికి ఎంతో మేలు చేసే చేయాలన్న ఉద్దేశంతో అంకితభావంతో పనిచేసేవారు. అందుకోసం బ్రిటిష్ ఆదిపత్యంతో కూడుకున్న న్యాయవాద వత్తిలో మన ప్రజలకు న్యాయం జరిగేలా కోర్టులో పోరాటం చేసేవారు. చురుకైన న్యాయవాదిగా, చిత్తూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. స్వాతంత్ర పోరాటంవైపు గాంధీజీ పిలుపునందుకుని ఆకర్షితులయ్యారు. బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో ఒక ప్రముఖ నాయకునిగా రాష్ట్రంలోనూ, దేశంలోనూ గుర్తింపు పొందారు.
సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా కోర్టుకు వెళ్లకుండా న్యాయవాద వత్తిని 1921 -22 మధ్యలో ఏడాది పాటు బహిష్కరించారు. 1934 మద్రాసు కేంద్రంగా ఉన్న సెంట్రల్ అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. భారీ మెజారిటీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వివిధ ప్రజాసమస్యలు బ్రిటిష్ వలస ప్రభుత్వం దష్టికి తీసుకురావడంలో వాగ్దాటి కలిగిన శాసన సభ్యునిగా పేరు గడించారు. అసెంబ్లీలో తన సీటు వెనక ఎక్కడో ఉన్నా ముందుకు దూసుకొచ్చి మరీ సమస్యలను పెద్ద కంఠంతో ప్రస్తావించేవారు. 1940 నుంచి 1944వ సంవత్సరం వరకు మూడు సంవత్సరాల పాటు ఆయన కట్టిన కారాగారవాసాన్ని అనుభవించారు. ఒకసారి వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమం చేపట్టి జైలు పాలయ్యారు. మరోసారి క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా 1942లో జైలుకు వెళ్లారు. దేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చేందుకు పోరాటం చేయడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. గాంధీజీ పిలుపును అందుకొని దళితుల పట్ల అంటరానితనం నివారించేందుకు కషి చేశారు. వారు సామాజికంగా ఆర్థికంగా అభివద్ధి చెందేందుకు కొన్ని సంస్కరణలు అమలు చేయించారు. హరిజనసేవ సంఘానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తూ చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నుంచి రుణాలు సైతం ఇప్పించారు. చిత్తూరు మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికై రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన ఆ తరువాత జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్‌గాను ఎన్నికయ్యారు. స్వాతంత్రానికి పూర్వమే కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ వ్యక్తిగా వివిధ హౌదాల్లో పనిచేశారు. 1946-47 ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు ఏర్పాటు ఆయన రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా వ్యవహరించారు. రెండుసార్లు లోక్సభ స్పీకర్గా 1962 వరకు పనిచేసిన ఆయన తిరిగి మూడోసారి లోక్సభకు చిత్తూరు నుంచి ఎన్నికయ్యారు. అయితే కొద్ది కాలానికి ఆయన బీహార్ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులు కావడంతో తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంచి పార్లమెంటేరియన్‌గా ఆయన పేరు ఇప్పటికీ రాజకీయ నాయకులకు ఆదర్శంగా ఉంది.
1960లో జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించిన అంతర్దేశ పార్లమెంటేరియన్ సమావేశంలో మన దేశ పార్లమెంట్ సభ్యులకు నాయకుడిగా వ్యవహరించారు. రామ విలాససభ చిత్తూరు నాటకసభ పరిషత్, ది కాన్స్టిట్యూషన్ క్లబ్‌లను ప్రాంతీయ, జాతీయ సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగి అవగాహన ఖచ్చితమైన వైఖరి కలిగి తన అభిప్రాయాలను నిర్మహమాటంగా వెల్లడించే వ్యక్తిగా అయ్యంగా నిలిచారు. నెహ్రూ, పుచ్చలపల్లి సుందరయ్య వంటి రాజకీయ ఉద్దండలు సభ్యులుగా ఉన్న లోక్‌సభకు అధ్యక్షత వహించి సభ మర్యాదలు సమర్థవంతంగా అమలు చేసిన స్పీకర్‌గా అయ్యంగారికి పేరు ఉంది. విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతినిధిగా వ్యవహరించిన అనంతశయనం అయ్యంగార్ క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత విద్యారంగానికి సైతం ఎనలేని సేవలు అందించారు. సంస్కతం, తత్వశాస్త్రాల్లో మేధావిగా వివిధ సదస్సులో పోస్టుల్లో పాల్గొన్నారు. కేంద్ర విద్యా సలహా బోర్డు సభ్యులుగా రిషికుల్ యూనివర్సిటీ హరిద్వార్ ఛాన్స్‌లర్‌గా పనిచేశారు. 1954లో శ్రీవైష్ణవ యూనివర్సిటీ బందావనం వారు గౌరవ డాక్టరేట్‌తో అయ్యంగార్‌ను సత్కరించారు. గవర్నర్‌గా పనిచేసి రిటైర్ అయిన ఆయన తరువాత తిరిగి స్వస్థలం తిరుపతికి వచ్చి అక్కడే శేషజీవితాన్ని గడిపారు. అనంతశయనం అయ్యంగార్ స్వాతంత్ర సమరయోధునిగా, విద్యావేత్తగా, న్యాయవాదిగా, రాజకీయవేత్తగా, బహుళ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు గడించారు. నిరంతరం చురుకుగా వ్యవహరిస్తూ ప్రజాజీవితంలో తరించారు.










