May 20,2023 09:04

తెగుళ్లు సోకడంతో వాడిపోయిన బెండ మొక్క,, కాయలు

           పెద్దపప్పూరు : ఆరుగాలం శ్రమించే అన్నదాతకు ఏదో రూపంలో నష్టాలు తప్పడం లేదు. అతివృష్టి, అనావృష్టి, నకిలీ విత్తనాలు, తెగుళ్లు ఇలా ఏదో ఒకటి పంట చేతికందకుండా చేస్తోంది. కొత్తగా బెండపంటకు తెగుళ్లు సోకడంతో రైతులు పూర్తిగా నష్టాన్ని చవిచూశారు. కనీసం కూలీల ఖర్చు కూడా చేతికందని పరిస్థితి నెలకొనడంతో చేసేది లేక పంటను చేలల్లోనే వదిలేస్తున్నారు. పెద్దపప్పూరు మండల వ్యాప్తంగా బెండపంటకు కొత్తరకం తెగుళ్లతో రైతులు పూర్తిగా నష్టపోయారు.
పెద్దపప్పూరు మండల వ్యాప్తంగా 100 హెక్టార్లలో రైతులు బెండ పంటను సాగు చేశారు. పెద్దఎక్కలూరు, చెర్లోపల్లి, తురకపల్లి, రెడ్డిపల్లి, పప్పూరు, బొందలదిన్నె తదితర గ్రామాల్లో ఈ పంటను సాగు చేశారు. బెండకు గత నెల వరకు మంచి ధర పలికింది. ధర బాగా ఉండడంతో ఈ సారి లాభాలు కళ్లజూస్తామని రైతులు భావించారు. ఈ ఆశ రైతులకు ఎక్కువ కాలం నిలవలేదు. తెగుళ్ల రూపంలో రైతుల ఆశలపై నీళ్లుచల్లినట్లు అయ్యింది. పంటచేతికొచ్చే సమయంలో కొత్త రకం వైరస్‌ బెండకు సోకింది. ఈ తెగుళ్ల నివారణకు వేలాది రూపాయలు ఖర్చు చేసి రసాయనాలను చల్లారు. అయినా ఫలితం లేదు. రసాయనాలు పిచికారీ చేయడం వల్ల తెగుళ్లు నశించకపోగా రైతులకు ఖర్చులే మిగిలాయి. ఈ వైరస్‌ సోకకమునుపు వరకు బెండ కిలో రూ.30 నుంచి రూ.40 వరకు ధర ఉండేది. తెగుళ్లు సోకిన అనంతరం కాయ నల్లగా మారి పచ్చదనం తగ్గడంతో కనీసం రూ.10కి కూడా అడిగే వారు కరువయ్యారు. కాయలను తొలగించేందుకు కూలి ఖర్చులు కూడా రావడం లేదని భావించిన రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఎకరా బెండపంట సాగు చేసేందుకు విత్తనాలకు రూ.14వేలు, రసాయనాలకు రూ.2వేలు, దుక్కులు, కూలి తదితర ఇతర ఖర్చులన్నీ కలిపి రూ.50వేల వరకు ఖర్చు వస్తోంది. రూ.50వేలు ఖర్చు చేస్తే కనీసం రూ.10వేలు కూడా చేతికందని పరిస్థితి నెలకొంది. తెగుళ్ల కారణంగా ఉన్న కొద్దిపాటి కాతను కూడా ఏమీ చేయలేక పొలంలోనే వదిలేసే పరిస్థితి నెలకొంది. బెండకు తెగుళ్లతో రైతులు ఇబ్బంది పడుతున్నా దాని నివారణకు వ్యవసాయ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. పంట పొలాలను కూడా నామమాత్రంగానే పరిశీలిస్తున్నారు. నాశిరకం విత్తనాల వల్ల తెగుళ్లు సోకినట్లు రైతులు భావిస్తున్నారు. దీనిపై వ్యవసాయ అధికారులు పరిశోధనలు జరిపితే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. ఒక వేళ నాశిరకం విత్తనాల వల్లనే తెగుళ్లు సోకిఉంటే నష్టపరిహారం ఆ కంపెనీల నుంచే ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.
పంట మొత్తం పోయింది.. : రైతు శేషారెడ్డి.
నాకున్న రెండు ఎకరాల్లో బెండుపంటను సాగు చేశాను. అనంతపురంలోని ఫర్టిలైజర్‌ షాపులో శంకర్‌ అనే బండ విత్తనాలు 5కిలోలు తీసుకొచ్చి సాగు చేశాను. పంట సాగు కోసం దాదాపు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాను. పంట సాగు చేసే ముందు వర్షాలు బాగా రావడంతో దిగబడి బాగా వస్తుందన్న ఆశతో పంటను సాగు చేశాను. తీరా పంట చేతికొచ్చే సమయానికి బెండకు కొత్తరకం వైరస్‌ సోకింది. ఒక్క రూపాయి కూడా చేతికొచ్చే పరిస్థితి కన్పించడం లేదు. పెట్టుబడులు మొత్తం కోల్పోయి పూర్తిగా నష్టపోయాను. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందజేయాలి.
తెగుళ్ల నివారణకు చర్యలు
ఉమాదేవి, మండల ఉద్యానవన అధికారి.

పెద్దపప్పూరు మండలంలో బెండ పంటకు కొత రకం తెగుళ్లు సోకినట్లు తమ దృష్టికి వచ్చింది. దీనిపై ఇప్పటికే ఆయా గ్రామాల్లో పర్యటించి తెగుళ్లను పరిశీలించాం. పంటకు తెగుళ్లు సోకిన మాట వాస్తవమే. దీనికి కారణాలు ఏమిటన్నది తెలుసుకుంటున్నాం. నకిలీ విత్తనాల వల్ల వైరస్‌ సోకినట్లు తెలిస్తే సంబంధిత కంపెనీల నుంచి రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటాం.