Oct 27,2023 21:27

ఫొటో : పార్కులో మౌలిక వసతులను పరిశీలిస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుప్రజమురళి

బెజవాడ గోవర్ధన్‌రెడ్డి పార్కులో పరిశీలన
ప్రజాశక్తి బుచ్చిరెడ్డిపాలెం : బుచ్చి నగరంలో త్వరలో ప్రారంభం కానున్న బెజవాడ గోపాలరెడ్డి పార్క్‌ గ్రీన్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మోర్ల సుప్రజమురళి, కమిషనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి పరిశీలించారు. పార్కులో అన్ని వసతులు, ప్రతిపాదిత అంశాలు సంపూర్ణమైన తరువాతనే ప్రారంభించడం మంచిదన్న విషయమై చర్చించారు. గ్రీన్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ పనులు పరివేక్షిస్తున్న మున్సిపల్‌ కాంటాక్టర్‌ చిరమణ సురేష్‌కు సూచించారు. పార్క్‌లో నిర్మించిన వాకింగ్‌ ట్రాక్‌ సామర్థ్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కాంటాక్టర్‌ చిరమణ సురేష్‌ మాట్లాడుతూ అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకుంటున్న థీమ్‌ పార్కును పచ్చదనంతో పాటు విద్యుత్‌ వెలుగులు విరజిమ్మే విధంగా వివిధ రకాల పూలమొక్కలను ఆకర్షణీ యంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
వాకింగ్‌ ట్రాక్‌, విశాలమైన స్థలంలో బెంచీల ఏర్పాటు, వృద్ధులు మహిళల కోసం యోగా, కరాటే, మెడిటేషన్‌ తదితర వసతులు, యువతకు వ్యాయామ పరికరాలు ఓపెన్‌ జిమ్‌, పిల్లలకు ఆట వసతులును ఏర్పాటు చేశామని తెలిపారు. పరిశీలన అనంతరం చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ కోటి రూపాయల నిధులతో పార్కు అభివృద్ధికి సహకరించిన ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. నాణ్యతలో రాజీ పడకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి పార్క్‌లను ప్రజలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నగరానికి తలమానికంగా బెగోర పార్క్‌ నిలవనుందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌లు జయంతి, షకిలా, అనంతమ్మ, ప్రమీలమ్మ, కాంట్రాక్టర్‌లు చిరమణ సురేష్‌, ఇలియాజ్‌, బిట్రగుంట సురేష్‌, మైనారిటీ నాయకులు డాక్టర్‌ అల్లాబక్షు, ఎ.ఇ. ప్రసాద్‌, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.