May 16,2023 21:40

మాట్లాడుతున్న యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వి.కోటేశ్వరప్ప

        ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) రాష్ట్ర కార్యదర్శి వి.కోటేశ్వరప్ప డిమాండ్‌ చేశారు. మంగళవారం నగరంలోని యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్‌ను విడుదల చేయాలన్నారు. దాదాపు సంవత్సర కాలం నుంచి బదిలీలు ప్రమోషన్లు షెడ్యూల్‌ను వేసవి సెలవుల్లో ప్రకటిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి షెడ్యూల్‌ ఇవ్వలేదన్నారు. కాగా ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను 1, 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో కలపడం ద్వారా అనేక మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాష విద్యా విధానాన్ని తొలగించి సరైన సౌకర్యాలు, ఉపాధ్యాయులను నియమించకనే సిబిఎస్‌ విధానాన్ని ప్రవేశ పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురై డ్రాప్‌ అవుట్‌గా మిగిలిపోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు లింగమయ్య, ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు, జిల్లా గౌరవాధ్యక్షులు రమణయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దేవేంద్రమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు రామప్ప చౌదరి, కోశాధికారి రాఘవేంద్ర, కార్యదర్శులు అర్జున్‌, హనుమంతురెడ్డి, రాముడు, రాష్ట్ర కౌన్సిలర్‌ ఈశ్వరయ్య, సూర్యనారాయణ, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ సుబ్బారాయుడు, తదితరులు పాల్గొన్నారు.