Apr 07,2023 20:31

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో విస్తృత చర్చ
ఉమ్మడి జిల్లాలోని సచివాలయాల్లో ఏడు వేల మందికిపైగా ఉద్యోగులు
60 శాతానికిపైగా ఉద్యోగులు బదిలీ కోసం ఎదురుచూపులు
ఏప్రిల్‌లో బదిలీలంటూ పెద్దఎత్తున ప్రచారం
ప్రభుత్వం నుంచి కదలిక లేకపోవడంతో ఉద్యోగుల్లో నిర్వేదం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బదిలీల కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. దూరప్రాంతాల వారంతా తమ సొంత ప్రాంతాలకు వెళ్లాలని తహతహలాడుతున్నారు. ముఖ్యంగా వేరే జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులు కుటుంబపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2019 అక్టోబర్‌ రెండో తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బాధ్యతలు చేపట్టారు. మూడున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి బదిలీల ప్రక్రియ చేపట్టలేదు. 2021 అక్టోబర్‌కు సచివాలయ ఉద్యోగులకు రెండేళ్లు పూర్తయినా రెగ్యులర్‌ చేయకుండా తొమ్మిది నెలలు ఆలస్యంగా 2022 జులైలో రెగ్యులర్‌ చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఉద్యోగులంతా తొమ్మిది నెలల సర్వీసు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. రెగ్యులర్‌ చేయడంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం బదిలీల విషయంలోనూ కాలయాపన చేస్తుందనే విమర్శలు ఉద్యోగుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. నియామకాల సమయంలో తమ సొంత ప్రాంతాలకు 50 కిలోమీటర్ల అంతకు మించి ఎక్కువ దూరంలో పోస్టింగులు వచ్చాయి. బదిలీలు జరిగేటప్పుడు తమ ప్రాంతాలకు వెళ్లొచ్చనే ఆలోచనతో ఉద్యోగాల్లో చేరిపోయారు. తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాలకు చెందిన ఉద్యోగులు కూడా జిల్లాలో పని చేస్తున్నారు. కుటుంబం ఒకచోట, ఉద్యోగం మరోచోట అన్నట్లు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి తయారైంది. జిల్లాలో 938 గ్రామ సచివాలయాలు, 207 వార్డు సచివాలయాలు మొత్తం 1,165 ఉన్నాయి. వీటిలో దాదాపు ఏడు వేల మంది వరకూ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో 60 శాతం మందికిపైగా సచివాలయ ఉద్యోగులు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. బదిలీల్లో తాము కోరుకున్న స్థానానికి వెళ్లొచ్చని, కుటుంబంతో ఉండొచ్చని ఆశపడుతున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం బదిలీలపై ఎటువంటి కదలికా లేకుండాపోయింది. కొద్దిరోజుల క్రితం సచివాలయ ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ మంత్రులతో బదిలీలపై మాట్లాడామని, ఏప్రిల్‌లో ఉండొచ్చని ప్రకటించారు. ఏప్రిల్‌ రావడంతో సచివాలయ ఉద్యోగుల్లో బదిలీలపై చర్చ పెద్దఎత్తున సాగుతోంది. బదిలీల ప్రక్రియ ఎప్పుడు చేపడతారని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు బదిలీలు చేయకపోతే ఎన్నికల దగ్గర పడుతుండటంతో ఇక చేపట్టే పరిస్థితి ఉండదనే ఆందోళన అందరినీ వెంటాడుతోంది. బదిలీలు చేపట్టాలంటూ సచివాలయ ఉద్యోగులంతా ముక్తకంఠంతో కోరుతున్నారు. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
సచివాలయ ఉద్యోగుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తమ మానస పుత్రికగా వైసిపి ప్రభుత్వం పదేపదే చెబుతోంది. వచ్చే ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగులు వైసిపికి అండగా ఉంటారని భావిస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రభుత్వంపై సచివాలయ ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోంది. సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడంలో తొమ్మిది నెలలు ఆలస్యం చేయడంతో అన్ని నెలల సర్వీసు, పే స్కేల్‌లో వచ్చే పెంపు జీతం కోల్పోయామనే భావన ఉద్యోగుల్లో నెలకొంది. అంతేకాకుండా స్థానికంగా ఉన్న వైసిపి నాయకులు సచివాలయ ఉద్యోగులపై పెత్తనం చేస్తున్న తీరుతో వారంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ముఖ్యంగా సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులను బందోబస్తు పేరుతో పోలీసు అధికారులు పెడుతున్న ఇబ్బందులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వం బదిలీల ప్రక్రియపై మౌనం వహించడం, సమస్యలు అపరిష్కృతంగా ఉండటంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పేరుకుపోయినట్లు తెలుస్తోంది.