ప్రజాశక్తి - భీమవరం
చదువు మానేసి బడి బయట ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో డ్రాప్‌వుట్లపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లాలో 473 మంది పిల్లలు బడి బయట ఉన్నారని, వీరందరినీ పాఠశాలలో చేర్చేందుకు చర్యలను వేగవంతం చేయాలని అన్నారు. అనారోగ్య కారణాలు, మైగ్రేషన్, బాల్య వివాహాలు తదితరాలు డ్రాప్‌ఔట్స్‌కు కారణంగా ఉన్నాయన్నారు. బాల్య వివాహాలు చేసుకున్న ఆడపిల్లలను పట్టణ వసతి గృహాల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనారోగ్య కారణాలు చూపుతున్న వారి వివరాలను ఫొటోతో సహా సేకరించి ఉంచాలన్నారు. ఈ సమావేశంలో డిఇఒ ఎ.వెంకటరమణ, సమగ్ర శిక్ష ఎపిసి పి.శ్యాంసుందర్, ఎఎల్‌ఎస్ కోఆర్డినేటర్ జిఎజె.దీవెనమ్మ, జిల్లా స్త్రీ, శిశుసంక్షేమ శాఖాధికారి సుజాతరాణి, భీమవరం డిఎల్‌డిఒ కె.కృష్ణకిషోర్ పాల్గొన్నారు.










