అనంతపురం కలెక్టరేట్ : 5 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులు బడి బయట ఒక్కరూ ఉండరాదని, చిన్నారులను ఖచ్చితంగా బడిలో చేర్పించాలని కలెక్టర్ ఎం.గౌతమి ఆదేశించారు. బుధవారం నాడు అనంతపురం నగరంలోని 40, 41వ వార్డు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జిఈఆర్) సర్వేపై విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాశాఖ పరిధిలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సర్వే వంద శాతం చేపట్టాలన్నారు. 5-18 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులను ఖచ్చితంగా బడిలో చేరేలా చూడాలన్నారు. చిన్నారులు ఎక్కడికి వెళ్లారనేది ప్రతిరోజూ గుర్తించాలన్నారు. ఈ విషయమై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేయాలని డిఈఓని ఆదేశించారు. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పిల్లలను గుర్తించాలన్నారు. ప్రతి వాలంటీర్ పరిధిలో వంద శాతం పిల్లలు ఎన్‌రోల్మెంట్ అయ్యారా.. లేదా..? అనేది పరిశీలన చేసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాలికల డ్రాప్ అవుట్ ఉండడానికి వీలు లేదన్నారు. నాడు- నేడు పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి, డీఈవో సాయిరామ్, ఆర్‌ఐఒ వెంకటరమణ నాయక్, డీఎల్డీవో ఓబులమ్మ, ఎంఇఒ వెంకటస్వామి, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్‌లు పాల్గొన్నారు.










