బావిలో పడిన ఏనుగు
అటవీ శాఖ అధికారులపై రైతుల ఆగ్రహం
ప్రజాశక్తి- బంగారుపాళ్యం :
ఏనుగుల గుంపులోని ఓ ఏనుగు పొరపాటున వ్యవసాయ బావిలో పడిన సంఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి పంచాయతీలోని గాండ్లపల్లిలో చోటుచేసుకుంది. డిఎఫ్‌ఓ చైతన్యకుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మొగిలి పంచాయతీ గాండ్లపల్లి సమీపంలోని యశోదయ్య, త్యాగరాజరెడ్డి, దొరస్వామిరెడ్డి, నాగభూషణం రెడ్డిలకు చెందిన వరి పంటను సోమవారం రాత్రి తొమ్మిది ఏనుగులు గుంపుగా తొక్కి నాశనం చేశారు. అనంతరం పక్కనే ఉన్న జగన్నాథం నాయుడుకి చెందిన మామిడి తోపులోని బావిలో గుంపులోని ఓ ఏనుగు పడి పోయింది. రాత్రి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బావిలో ఏనుగును గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా కొందరు రైతులు అటవీ శాఖ వారి అడ్డుకున్నారు. తాము కష్టపడి పండించిన పంటలను తొక్కి నాశనం చేస్తున్న నష్టం కలిగిస్తున్న ఏనుగులను ఎందుకు సంరక్షించాలని ఆలోచనతో రావడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. సంఘటన స్థలానికి చేరుకున్న డిఎప్‌ఓ చైతన్యకుమార్‌రెడ్డి, సిఐ నరసింహారెడ్డి, ఎస్సై మల్లికార్జున్ రెడ్డి, రేంజర్ నయం ఆలీ రైతులతో మాట్లాడి రైతులకు నష్టపరిహారం నమోదు చేస్తామని, నష్టపరిహారాన్ని త్వరలో అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం శాంతించిన రైతులు ఏనుగును బయటకు తీసేందుకు జెసిబి సహాయంతో గాడికొట్టి ఏనుగును బయటకు తీసిసమీపంలోని అడవిలోకి మళ్లించారు.










