Sep 08,2023 22:54

మాట్లాడుతున్న గొండు సీతారాం

* స్థానిక ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషించాలి
* రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు జి.సీతారాం
ప్రజాశక్తి - రణస్థలం రూరల్‌: 
రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిస్థాయిలో నిర్మూలన చేయాలంటే స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు గొండు సీతారాం అన్నారు. స్థానిక వెంకటేశ్వర కళ్యాణ వేదిక వద్ద ఐసిడిఎస్‌ సిడిపిఒ సిహెచ్‌.ఝాన్సీబారు ఆధ్వర్యాన స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ సచివాలయాల మహిళా సంరక్షణ, సంక్షేమ, విద్యా కార్యదర్శులతో బాల్య వివాహాలు నిలుపుదలలో ప్రజాప్రతినిధులు, వార్డుల సచివాలయాల కార్యదర్శుల పాత్రపై అవగాహనా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కమిషన్‌ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాల్లోని అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, బాలలతో పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థలు, సంఘాలతో పలు కార్యక్రమాలను రూపొందించామన్నారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం జిఒ నంబరు 31 అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. వార్డు మహిళా సంక్షేమ కార్యదర్శులకు కన్వీనర్లుగా బాధ్యతలను అప్పగించామన్నారు. ఈ నేపథ్యంలో మహిళా పోలీస్‌ సిబ్బందితో బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి బాల్య వివాహానికి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి చర్యలు చేపట్టాలని పోలీసులు, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బాల్య వివాహ నిరోధక చట్టం విధి విధానాలు, శిక్షలు, జరిమానాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కైలాష్‌ సత్యార్థి ఫౌండేషన్‌ రూపొందించిన బాల్య వివాహాల నిలుపుదలలో స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల సహకారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో రణస్థలం ఎంపిపి ప్రతినిధి పిన్నింటి సాయికుమార్‌, వైస్‌ ఎంపిపి భుజంగరావు, ఐసిడిఎస్‌ పీడీ బి.శాంతిశ్రీ, జిల్లా బాలల సంరక్షణ అధికారి కె.వెంకటరమణ, తహశీల్దార్‌ ఎస్‌.కిరణ్‌ కుమార్‌, సర్పంచ్‌ బి.రమణ, ఎంపిడిఒ రమణమూర్తి, ఎస్‌ఐ రాజేష్‌, ఎంఇఒ లావణ్య, బాలల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.