Oct 11,2023 22:41

మాట్లాడుతున్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు సీతారాం

* బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు సీతారాం
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : 
బాల్య వివాహాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రజల్లో మరింత అవగాహన అవసరమని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు గొండు సీతారాం అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని బాపూజీ కళామందిర్‌లో బాల్య వివాహాలు నిషేధ చట్టం-2006, జిఒ నంబరు 31పై మునిసిపల్‌ అధికారులు, వార్డు సచివాలయాల మహిళా సంరక్షణ, సంక్షేమ కార్యదర్శులు, పలు ప్రభుత్వ శాఖల అధికారులకు అవగాహనా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడానికి కమిషన్‌ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వివాహ ఆహ్వాన పత్రిక అందినపుడు వధువు వయసు 18 ఏళ్లు పూర్తయిందా, వరుడు వయసు 21 ఏళ్లు ఉందా, లేదా అన్న సమాచారం తెలుసుకోవాలన్నారు. లేకుంటే బాల్య వివాహానికి హాజరైన వారంతా నిందితులుగానే పరిగణించబడతారని తెలిపారు. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను సమాజం గ్రహించాలన్నారు. బాల్య వివాహాల నిర్మూలన బాధ్యత వార్డు సచివాలయాల కార్యదర్శులపై ఉందన్నారు. ప్రతి బాల్య వివాహానికి పోలీసు శాఖ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బాల్య వివాహాలపై ముందస్తు సమాచారం ఉండీ, వివాహ నిలుపుదలలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. బాల్య వివాహాలపై ఆధారాలతో aజూరషజూషతీ2018ఏస్త్రఎaఱశ్రీ.షశీఎకి సమాచారం అందిస్తే చట్ట ప్రకారం కమిషన్‌ చర్యలు చేపడుతుందని చెప్పారు. అనంతరం కైలాస్‌ సత్యార్థి ఫౌండేషన్‌ రూపొందించిన బాల్య వివాహాల నిర్మూలన పుస్తకాలను ఆవిష్కరించారు. బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ యు.శ్రీలక్ష్మి, ఐసిడిఎస్‌ పీడీ బి.శాంతిశ్రీ, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు, ఎఎస్‌పి జె.తిప్పేస్వామి, డిఇఒ వెంకటేశ్వరరావు, జిల్లా బాలల సంరక్షణాధికారి వెంకటరమణ, ఆర్‌ఐఒ దుర్గాప్రసాద్‌, మెప్మా పీడీ కిరణ్‌, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు.
సమర్థవంతంగా వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం
పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన వ్యాది నిరోధక టీకాలు క్రమం తప్పకుండా వేయించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు గొండు సీతారాం సూచించారు. టీకా కార్యక్రమంపై జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సమీక్షించారు. బిడ్డ పుట్టింది మొదలు పదేళ్ల వయసు వరకు క్రమపద్ధతిలో టీకాలు వేయించాలన్నారు. ప్రజల్లో టీకా కార్యక్రమంపై అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలకు వేస్తున్న వ్యాక్సిన్లను జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖ అధికారి అనురాధ వివరించారు. సమావేశంలో జిల్లా బాలల సంరక్షణాధికారి వెంకటరమణ, వైద్యాధికారులు సి.పి శ్రీదేవి, సుజాత, జి.వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.