Nov 07,2022 21:37

పక్షులు చనిపోవడానికి గల కారణాలను అన్వేషిస్తున్న విద్యార్థులు

బాలల సృజనకు ప్రయోగ వేదిక
30వ జాతీయ సైన్సు కాంగ్రెస్‌కు సన్నాహాలు
మార్గదర్శకాలు విడుదల
ఏర్పాట్లలో అధికారులు

ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి

బాలల్లో సృజనాత్మకత, విజ్ఞానశాస్త్రంపై ఆసక్తి పెంచేందుకు ఉద్దేశించిన 30వ జాతీయ సైన్సు కాంగ్రెస్‌కు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు దీన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాలో దీన్ని 17వ తేదీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
బాలబాలికల్లో సృజనాత్మకత, విజ్ఞానశాస్త్రంపై ఆసక్తి పెంచేందుకు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కమ్యూనికేషన్‌, రాష్ట్ర శాస్త్రసాంకేతిక మండలి సంయుక్తంగా జాతీయ బాలల సైన్సుకాంగ్రెస్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తున్నాయి. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో నమూనాల ప్రదర్శనలు నిర్వహించి, వీటిల్లో బహుమతులు ప్రదానం చేస్తారు. సమస్యలకు శాస్త్రీయ పరిష్కారానికి కృషి చేయడం, సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఆవిష్కరణలకు ఈవేదిక ఉపయోగపడుతుంది. కోవిడ్‌ కారణంగా రెండేళ్లు ఆన్‌లైన్‌లో వీటిని నిర్వహించారు. ఇప్పుడు ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. ఇదివరకు దీన్ని తిరుపతిలో మాత్రమే నిర్వహించేవారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా కేంద్రం వేదికగా ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 17వతేదీ స్థానిక విజ్ఞానదీప్తి స్కూల్‌లో ఏర్పాటు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 200కు పైగా ప్రదర్శనలు ఇందులో ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఉత్తమ ప్రాజెక్టులు ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపుతారు. అక్కడి నుంచి జాతీయ స్థాయికి పంపుతారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్రదర్శనలకు రూ.5వేలు, జాతీయస్థాయికి ఎంపికైన వాటికి రూ.3వేలు ఇస్తారు. డిగ్రీ కళాశాల లెక్చరర్లు, నిపుణులు వీరిని ఎంపిక చేస్తారు.
అర్హులు ఎవరు..?
ఈ సైన్సు కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు అర్హులను కూడా మార్గదర్శకాల్లో స్పష్టంగా తెలిపారు. ఇద్దరు బాలప్రతినిధులతో కూడిన బృందాలు ఇచ్చిన అంశంపై ప్రాజెక్టులు చేయాలి. 10 నుంచి 17ఏళ్ల లోపు విద్యార్థులు పాల్గొనొచ్చు. బడి మానేసిన వారు కూడా ప్రాజెక్టు చేపట్టొచ్చు. 10 నుంచి 14 ఏళ్ల వారు జూనియర్లుగా 15 నుంచి 17ఏళ్ల వారు సీనియర్లుగా పరిగణలోకి తీసుకుంటారు. ఇన్‌స్పైర్‌లాగా కాకుండా జీతీయ సైన్సు కాంగ్రెస్‌ పోటీల్లో పరిశోధన అంశానికి సంబంధించి ఫోటోలు, మ్యాప్‌లు, ప్రయోగ వివరాలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. వంద మార్కులకు పోటీ ఉంటుంది. సరికొత్త ఆలోచనకు మరో 100 మార్కులుంటాయి. క్షేత్ర పరిశీలన, సమాచార సేకరణ, సర్వేపద్ధతులు, విశ్లేషణ సామర్థ్యం సృజనకు పదును పెట్టడం ద్వారా జివితంలో ఎదురయ్యే సమస్యలకు విద్యార్థులు పరిష్కారం కనుక్కొంటారు.

నాణ్యత పెరుగుతుంది..
జిల్లా నుంచి విద్యార్థులు చేస్తున్న ప్రాజెక్టుల నాణ్యత బాగుటుంది. ఉపాధ్యాయుల సహకారంతో ప్రజలకు ఉపయోగపడే పర్యావరణ సమస్యలపై మంచి ప్రాజెక్టులు రూపొందించొచ్చు. ఈసంవత్సరం ఎక్కువ ప్రాజెక్టులు వస్తాయని ఆశిస్తున్నాం.
- మోహన్‌రామ్‌, ఎపి శాస్త్ర సాంకేతిక విజ్ఞాన మండలి కో-ఆర్డినేటర్‌
గుర్తింపు లభిస్తుంది
- విజయేంద్రరావు, డిఇఓ
బాలల సైన్సు కాంగ్రెస్‌లో ప్రదర్శించే ప్రాజెక్టులను తయారు చేయడంలో విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. విద్యార్థి దశ నుంచే పరిశోదనలపై దృష్టి సారిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది
ఉపాధ్యాయుల చొరవ ముఖ్యం
జాతీయ బాలల సైన్సుకాంగ్రెస్‌లో పెద్దఎత్తున విద్యార్థులు పాల్గొనే ఉపాధ్యాయులే చొరవ తీసుకోవాలి. విద్యార్థులు సబ్జెక్టుల్లోని విషయాలతో పాటు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికిత సృజనాత్మకతతో పరిష్కారాలు చూపేలా నమూనాలు తయారు చేసేలా ప్రోత్సహించాలి.
- ఆర్‌వి. రమణ, జిల్లా సైన్సు అధికారి
పరిశోధనల ప్రాధాన్యం గుర్తించేలా..
పరిశోధనకు ఉన్న ప్రాధాన్యం గుర్తించేలా విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని రూపొందించాలి. పర్యావరణాన్ని కాపాడటంలో విద్యార్థుల పాత్ర కీలకం. - వి.పురుషోత్తం, ఆంధ్రప్రదేశ్‌ శాస్త్ర సాంకేతిక
మండలి జిల్లా కో-ఆర్డినేటర్‌