Aug 08,2023 22:46

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి

     అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో బాలికల నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాలు మరియు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ యం. గౌతమి ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం (1994, రూల్స్‌ 1996, పిసి, పిఎన్డిటి యాక్ట్‌)అమలుకు సంబంధించి జిల్లాస్థాయి జాయింట్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామస్థాయిలో విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌, సచివాలయం ఏఎన్‌ఎం, మహిళా పోలీస్‌, అంగన్వాడీ వర్కర్‌, ఆశా వర్కర్‌ కమిటీగా ఏర్పడి కలిసి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మండల స్థాయిలో తహసీల్దార్‌ చైర్మన్‌ గా, మెడికల్‌ ఆఫీసర్‌ కన్వీనర్‌గా, ఎంపీడీవో, సబ్‌ ఇన్సెపెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌, ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌, ఆశా నోడల్‌ ఆఫీసర్‌, స్వచ్ఛంద సంస్థ బాధ్యులు ఒక కమిటీగా ఏర్పడి మండల స్థాయిలో బాలికల నిష్పత్తి సమానంగా ఉండేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. అన్ని ఉన్నత పాఠశాలలలో, కేజీబీవీ రెసిడెన్షియల్‌ పాఠశాలలలో ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వైద్య సిబ్బంది ఏర్పాటు చేయాలని, ఇవన్నీ ఒక యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారం నిర్వహించాలని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని, నిరంతరం కొనసాగించినప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా||యుగంధర్‌, అదనపు జిల్లా పోలీస్‌ అధికారి విజయ భాస్కర్‌ రెడ్డి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీదేవి, జిల్లా ఆసుపత్రుల కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కృష్ణవేణి, డ్రగ్‌ ఇన్సెపెక్టర్‌ హనుమన్న, వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.