Apr 01,2022 14:38

ప్రజాశక్తి-తిరుపతి : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి కేంద్రంగా కొత్తగా ఏర్పాటు కానున్న శ్రీ బాలాజీ జిల్లాలో తాత్కాలిక కలెక్టరేట్ ఏర్పాటుకు అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ సంబంధింత అది కారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం శ్రీ పద్మావతి నిలయంలో తాత్కాలిక కలెక్టరేట్ ఏర్పాటులో భాగంగా జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటులో భాగంగా శ్రీ బాలాజీ జిల్లాలో తాత్కాలిక కలెక్టరేట్ ఏర్పాటుకు అవసరమైన వసతులను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని ఈ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఇప్పటికే 30 ప్రభుత్వ శాఖలకు కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన గదులను కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ నుండి కొత్త జిల్లాలలో ఏర్పాటులో భాగంగా పరిపాలన ప్రారంభమవుతుందన్నారు. తాత్కాలిక కలెక్టరేట్ లో కలెక్టర్ చాంబర్, జాయింట్ కలెక్టర్లు ఛాంబర్లు, వీడియో కాన్ఫరెన్స్ హాల్, సమావేశ మందిరము, ఇతర కార్యాలయాలలో జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట తిరుపతి ఆర్డిఓ కనక నర్సారెడ్డి, ఆర్ & బి ఈఈ సుధాకర్ రెడ్డి ఇతర సంబంధిత అధికారులు ఉన్నారు.