Mar 27,2023 21:12

ప్రజాశక్తి - భీమవరం
స్పందనలో వచ్చిన అర్జీలను బాధ్యతతో పరిశీలించి సమస్యలకు పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణవేణి అధికారులను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన 162 అర్జీలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినతుల పరిష్కారం అర్జీదారులు సంతృప్తి చెందేలా ఉండాలన్నారు. అర్జీలు తిరిగి రీఓపెన్‌ అయ్యే అవకాశం లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఒకే సమస్యపై రెండోసారి స్పందనలో ఫిర్యాదు రాకుండా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఒ ఎం.నాగలత, డిఎల్‌డిఒ కెసిహెచ్‌.అప్పారావు, భీమవరం డిఎస్‌పి బి.శ్రీనాథ్‌ పాల్గొన్నారు.