Sep 02,2022 23:07

ధర్నా చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి - పలమనేరు : ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్త వదిలేయడంతో బాధితురాలు శ్రీదేవికి మద్దతుగా జాతీయ మానవ హక్కులు, అవినీతి నిర్మూలణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరు జిల్లా పోలీస్‌ కార్యాలయం ఎదుట బాధితురాలుకి న్యాయం చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు డి.వి.మునిరత్నం, వేలాయుధం మాట్లాడుతూ, తిరుపతి పట్టణానికి చెందిన శ్రీదేవి, పుత్తూరు మండలం నారాయణవనంకు చెందిన, రామచంద్రన్‌ ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తూ మొదట పరిచయంగా ఏర్పడి ఆ తర్వాత ఇరువురు నిర్ణయంతో ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారని తెలిపారు. భార్యభర్తల దాంపత్యం సజావుగా జరుగుతున్న తరుణంలో విషయం తెలుసుకున్న రామచంద్రన్‌ తల్లిదండ్రులు జీర్ణించుకోలేక శ్రీదేవిని ఒంటరి చేసి తన కొడుకును నారాయణవనంకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. సుమారు సంవత్సరం కాలం గడుస్తున్నప్పటికీ భర్త రామచంద్రన్‌( ప్రస్తుతం హోమ్‌ గార్డ్‌) ఇప్పటివరకు ఒక్కసారి కూడా మాట్లాడలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీదేవి జరిగిన అన్యాయాన్ని దష్టిలో పెట్టుకొని ఎలాగైనా భర్తను దక్కించుకునే ప్రయత్నంలో సంబంధిత పోలీసు అధికారులను ప్రాధేయ పడినా స్పందించకపోవడం దారుణమన్నారు. కారు డ్రైవర్‌గా ఉన్న రామ చంద్రన్‌కు హోంగార్డు ఉద్యోగం వచ్చేసరికి శ్రీదేవిని అదనపు వరకట్నం కోసం భర్తతో పాటు అత్తమామలు వేధిస్తూ పలుమార్లు దాడి చేసి కొట్టడం దుర్మార్గ మన్నారు. పెళ్లి చేసుకుని మోసం చేసిన రామచంద్రన్‌తో పాటు, వరకట్నం కోసం వేధించి, కొట్టిన అత్తమామలపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని లేనిపక్షంలో ప్రజా, మహిళా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున శ్రీదేవికి అండగా నిలబడి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్థసారథి, తిరువలప్ప, భూదేవి, తదితరులు పాల్గొన్నారు