బాధితులను ఆదుకుంటాం : డిఆర్‌ఓ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: పెనుమూరులో జరిగిన సంఘటనకు సంబంధించి విచారణ చేయడం జరిగిందని ఆ కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.రాజశేఖర్ అన్నారు. సోమవారం సాయంత్రం స్పందన మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్‌తో కలిసి మరణించిన రైతు రత్నం కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఈసందర్భంగా డిఆర్‌ఓ విచారణ మేరకు కుటుంబ సభ్యుల అభ్యర్థనతో వివాదాస్పద 918 సర్వేనెంబరు భూమిలో ఎవరు ప్రవేశించకుండా చూడడం జరుగుతుందని దీనికి సంబంధించి వీఆర్‌ఏ, వీఆర్వోలు చూస్తారని అన్నారు. వారికి స్థలం కేటాయించేందుకు వారు కోరుతున్న స్థలం గురించి హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ప్రత్యామ్నాయస్థలం కోసం తహశీల్దారును పరిశీలించమని ఆదేశించడం జరిగిందన్నారు. అలాగే రత్నం చిన్న కుమారుడైన శివకుమార్‌కు అవుట్‌సోర్సింగ్ ద్వారా ఉద్యోగం కల్పించనున్నామని జిల్లా కలెక్టర్ సమక్షంలో డిఆర్‌ఓ ప్రకటించారు. దీనికి సంబంధించి వారు సమ్మతిని తెలియజేయడం జరిగింది. కలెక్టర్ సమక్షంలో డిఆర్‌ఓ ఇచ్చిన హామీలకు తాము సంతృప్తి చెందామని రత్నం కుటుంబ సభ్యులు ప్రకటించారు. రత్నం సోదరుడు రామచంద్రుడు, కుమారులు శివప్రసాద్, శివకుమార్, కుమార్తెలు మణి, జ్యోతి, సంఘసభ్యులు రామచంద్రరాజు, రామచంద్రలు పాల్గొన్నారు.










