Sep 15,2023 22:41

మంత్రి ఆర్కేరోజా


బాబుతో పవన్‌ ప్యాకేజీ మిలాఖత్‌ : మంత్రి
ప్రజాశక్తి -నగరి : బాబుతో పవన్‌ ప్యాకేజీ మిలాఖత్‌ బహిర్గతమైందని మంత్రి ఆర్కేరోజా అన్నారు. టీడీపీతో కలిసి పోటీచేస్తామని పవన్‌కళ్యాణ్‌ ప్రకటించడంపై ఆమె మీడియాతో మాట్లాడారు. జగనన్న చాలా ముందు చూపున్న వ్యక్తి కావడం వల్లే పవన్‌ కల్యాణ్‌ అనే వ్యక్తి దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్‌ అని మొదటి నుంచి చెబుతున్నారన్నారు. దేశంలోనే పార్టీ పెట్టి పక్కవాడి కోసం తాను పనిచేయడమే కాకుండా తన కార్యకర్తలను కూడా జెండా కూలీలుగా మార్చి ఇతర పార్టీల జెండాను మోయించే ఏకైక నాయకుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జైల్లో ఖైధీగా ఉన్న నాయకునితో పొత్తు పెట్టుకున్న ఏకైక పార్టీ జనసేన అన్నారు. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని బూతులు తిట్టించి, కొట్టి హింసిస్తే.. ఎందుకు ఆనాడు ఎందుకు పోరాటం చేయలేదన్నారు. సంఘీభావం తెలపడానికి వచ్చిన చిరంజీవిని అరెస్టు చేస్తే ఎందుకు నోరు తెరవలేదన్నారు. కాపుల మీద చంద్రబాబు అక్రమ కేసులు పెట్టి, లాఠీ ఛార్జ్‌ చేసినపుడు పవన్‌ కల్యాణ్‌ ఏమయ్యారన్నారు. నేడు ప్యాకేజీ కోసం నిస్సిగ్గుగా చంద్రబాబు కోసం పనిచేస్తున్నట్లు పవన్‌కళ్యాణ్‌ ప్రకటించారన్నారు. తన ప్యాకేజీ కోసం, దొంగ కోసం నమ్మిన కార్యకర్తలను రోడ్డుమీదకు తీసుకొచ్చిన పవన్‌ కల్యాణ్‌ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ స్కాంలో చంద్రబాబు ఎక్కడా సంతకాలు పెట్టలేదని చెప్పే వపన్‌ 13 చోట్ల చంద్రబాబు ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాడో ప్రూఫ్‌లతో సహా సీఐడీ చీఫ్‌ క్లియర్‌గా చూపించారని.. చదువు రాకపోతే సీఐడీ ఆఫీసుకు వెళ్లి భూతద్దం పెట్టుకుని వెతికి చూసుకోవాలన్నారు. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్టుగా చేసిన తప్పులకు ఈరోజు చంద్రబాబు అరెస్ట్‌ అయ్యాడే తప్ప, ఇది అక్రమ కేసు కాదని వీటితో జగన్‌మోహన్‌ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు.