''బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ''
ప్రజాశక్తి-కావలి : 15వ వార్డు ముసునూరులో బుధవారం సాయంత్రం కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో ''బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ'' కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అధిక సంఖ్యలో చేరుకున్న పార్టీ శ్రేణులతో కలిసి మహాలక్ష్మమ్మ దేవాలయంలో కరపత్రాలను అమ్మవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి మినీ మేనిఫెస్టోపై ప్రచారం చేశారు. జగన్‌కు దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ బలహీన వర్గాల సంక్షేమంపై ఏదని ప్రశ్నించారు. ప్రతి నివాసానికి వెళ్లి, ప్రజలతో మాట్లాడి చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీలో పేర్కొన్న అంశాలను తెలియజేస్తూ, రాబోయే ఎన్నికల్లో బాబును అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. అదేవిధంగా వారికి సంవత్సరానికి పార్టీ ఇచ్చే ఆదాయాన్ని తెలియజేస్తూ, బాండు రూపంలో వారికి అందించారు. అనంతరం అక్కడి ప్రజలతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. కావలి పట్టణ ప్రజల తాగునీటి సౌకర్యార్థం మంజూరు చేసిన అమృత పథకాన్ని ఎందుకు నిలిపివేశారని స్థానికంగా ఉన్న ట్యాంక్ వద్ద పత్రిక విలేకరుల సాక్షిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి పాలనంతా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ప్రజాసంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే దాడులు అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని కావలిలో అమృత పథకాన్ని పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో వైసిపికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. సంపదను సృష్టించి ప్రజలకు పంచే సామర్థ్యం చంద్రబాబుకే ఉందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పోతుగంటి అలేఖ్య, బొట్లగుంట శ్రీహరి నాయుడు, జ్యోతి బాబురావు, చింతాబత్తిన మాల్యాద్రి, తదితరులు పాల్గొన్నారు.










