Jul 09,2022 00:03

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపి రెడ్డప్ప

తాటాకు చప్పులకు మేము బెదరం : ఎంపి రెడ్డప్ప
ప్రజాశక్తి- పుంగనూరు:
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తావో చెప్పాలని, తాటాకు చప్పుళ్లకు మేము భయపడమని చిత్తూరు పార్లమెంటు సభ్యుడు రెడ్డప్ప అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన మినీ మహానాడులో వైసీపీపై బాబు తీవ్రమైన ఆరోపణలు చేశారని దీన్ని ఖండిస్తున్నామని చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన జనాన్ని చూసి రెచ్చిపోయి అవాకులు చవాకులు పేలుతూ ప్రసంగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లావాసి అయి ఉండి కుప్పంకి ఇంతవరకు తాగునీళ్లు అందించలేకపోయిన అసమర్థ ముఖ్యమంత్రివని నిరూపించుకున్న ఘనత నీకే దక్కుతుందన్నారు. నీ గురించి జిల్లా ప్రజలందరికీ తెలుసునని క్వారీ లైసెన్సు కుప్పంలో మీఅనుచరులకు నువ్వే అప్పజెప్పడం జరిగిందని, ఈరోజు వాటి గురించి మాట్లాడడం ఏమిటని అన్నారు. గతంలో స్కూలు మూసి వేసిన ఘనత చంద్రబాబుకే దక్కితే నేడు నాడు- నేడు పేరుతో విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత జగన్‌కు ఉంటుందన్నారు. ఈ జిల్లాలో రామచంద్రారెడ్డి ఏమి చెప్తే అదే జరుగుతుందని, కుప్పం ఓటరులో కూడా మార్పు వచ్చిందని వచ్చే ఎన్నికల్లో ప్రజాకోర్టులో నీకు శిక్ష తప్పదు అన్నారు. కుప్పం ప్రజలు ఈసారి తప్పకుండా ఓడిస్తారని జోష్యం చెప్పారు. సమావేశంలో ముడా చైర్మన్‌ వెంకట్‌ రెడ్డి యాదవ్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌ రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజురెడ్డి, జెడ్పిటిసి జ్ఞానప్రసూన చంద్రరెడ్డి యాదవ్‌, విజయభాస్కర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.