
* చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పలుచోట్ల ఆందోళనలు
* ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు
* ముఖ్య నాయకులు పోలీస్‌స్టేషన్లకు తరలింపు
* ఉదయం 11 వరకు ఆర్‌టిసి బస్సులు నిలిపివేత
ప్రజాశక్తి - శ్రీకాకుళం యంత్రాంగం: టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు వార్తలతో జిల్లాలో టిడిపి శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రభుత్వ తీరుపై మండిపడుతూ అన్ని మండలాల్లోనూ శనివారం ఆందోళనలు చేపట్టాయి. టిడిపి శ్రేణులు రోడ్దు మీదకు వస్తారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలకు పాల్పడ్డారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, ముఖ్య నాయకులను పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ప్రధాన పట్టణాల్లోని ముఖ్య కూడళ్లలో పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఉదయం 11 గంటల వరకు ఆర్‌టిసి బస్సులను నిలిపివేశారు.
ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను కవిటి మండలం రామయ్యపుట్టుగలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. సోంపేట సిఐ రవిప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసులు ఉదయం ఐదు గంటలకే ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. ఉన్నపళంగా తమతో రావాలని ఎమ్మెల్యేకి చెప్పడంతో పోలీసులకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసు వాహనంలో ఎమ్మెల్యే అశోక్‌ను ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో కవిటి పోలీస్‌స్టేషన్ వద్ద టిడిపి నాయకులు ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం అంటూ నినాదాలు చేశారు. తక్షణమే ఎమ్మెల్యే అశోక్‌ను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ను, అరసవల్లిలో మాజీ ఎమ్మెల్యే గుండ లకీëదేవిని వారి నివాసాల వద్ద అరెస్టు చేసి ఎచ్చెర్లలోని ఎఆర్ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. శ్రీకాకుళం నియోజకవర్గ టిడిపి యువ నాయకుడు గొండు శంకర్‌ను లావేర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు.
పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను కొత్తూరులోని ఆయన నివాసంలో అరెస్టు చేసి నౌపడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొత్తూరు మండల కేంద్రంలోని నాలుగు రోడ్లు కూడలి వద్ద ఆందోళన చేస్తున్న టిడిపి నాయకులు అగతముడి అరుణ్ కుమార్, పి.మోహనరావుతో పాటు మరో 26 మందిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
టిడిపి సంతబొమ్మాళి అధ్యక్షులు జీరు భీమారావును గృహ నిర్బంధం చేసి, టెక్కలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పోలాకి మండలంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పోలాకి, పిన్నింటిపేటలో ఆందోళనలు చేపట్టిన టిడిపి నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
ఇచ్ఛాపురం పట్టణంలో టిడిపి నాయకులు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కాళ్ల ధర్మారావు, సాలీనా ఢిల్లీ, కొండ శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బస్టాండ్ కూడలి నుంచి మార్కెట్ వరకు శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన నిరసన తెలిపారు. చంద్రబాబు అరెస్టును జనసేన ఇచ్ఛాపురం నాయకుడు లోళ్ల రాజేష్ ఒక ప్రకటనలో ఖండించారు.
వజ్రపుకొత్తూరు మండలంలో నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళన చేపట్టిన మాజీ ఎంపిపి గొరకల వసంతరావు, టిడిపి నాయకులు కణితి సురేష్, గిరి కూన షణ్ముఖరావు, ఎస్.చిట్టిబాబుతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు.
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో గాంధీ విగ్రహం వద్ద నుంచి ర్యాలీ నిర్వహించి బస్టాండ్ రోడ్డుపై బైఠాయించారు. ఇందిరాగాంధీ చౌక్ వద్ద మానవహారం చేపట్టారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.విఠల్‌రావు, లొడగల కామేశ్వరరావుతో పాటు మరో ముగ్గురిని ముందస్తు అరెస్టు చేశారు. శనివారం రాత్రి టిడిపి నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఆమదాలవలసలో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షులు మెట్ట సుజాత, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు రైల్వేస్టేషన్ జంక్షన్ వద్ద మెయిన్ రోడ్డుపై ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సుజాతను ఆటోలో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించేలోగా ఆమె ఆటో నుంచి కిందకు దిగి రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీస్ జీపులోకి ఎక్కించి తరలించారు. మొదలవలస రమేష్, నూకరాజు, అన్నెపు భాస్కరరావు, సనపల అప్పలనాయుడు తదితరులను గృహ నిర్బంధం చేశారు.
సరుబుజ్జిలి కూడలిలో టిడిపి మండల అధ్యక్షుడు అంబళ్ల రాంబాబు, నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో అలికాం-బత్తిలి రోడ్డు ఇటు పాలకొండ రోడ్డులో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి టిడిపి నాయకులు శివ్వాల సూర్యం, నందివాడ గోవిందరావు, మండల తెలుగు యువత అధ్యక్షుడు తాడేల రాజారావు, ఎండ రామారావు, కె.రవికుమార్‌ను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
నందిగాం మండల కేంద్రంలో సత్యసాయిబాబా ఆలయం నుంచి జాతీయ రహదారి వరకు టిడిపి నాయకులు ర్యాలీ నిర్వహించారు. దీంతో అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగప్రవేశం చేసి తెలుగు యువత మండల అధ్యక్షులు తూలుగు మహేష్, టిడిపి మండల అధ్యక్షులు అజరు కుమార్‌తో పాటు పలువురిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కోటబొమ్మాళి మెయిన్‌రోడ్డు, కొత్తపేట నుంచి టిడిపి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. టిడిపి మండల అధ్యక్షుడు బోయిన రమేష్, రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.
మెళియాపుట్టిలోని జాడుపల్లిలో టిడిపి నాయకులు ఆందోళన చేపట్టారు. టిడిపి మండల అధ్యక్షులు భాస్కరగౌడతో పాటు పలువురిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
టెక్కలిలో టిడిపి నాయకులు బగాది శేషగిరిరావుతో 24 మంది నాయకులను అరెస్టు చేశారు.
లావేరులో టిడిపి మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్, ఎఎంసి మాజీ చైర్మన్ ఇనపకుర్తి తోటయ్యదొర, పి.మధుబాబును అరెస్టు చేసి బూర్జ పోలీస్‌స్టేషన్‌కు అరెస్టు చేశారు. లావేరులో రాత్రి సిఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను టిడిపి నాయకులు దహనం చేశారు.
సోంపేట పోలీస్‌స్టేషన్ ఎదుట టిడిపి నాయకులు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో సూరాడ చంద్రమోహన్, దూసి మధు, చిత్రాడ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కంచిలిలోని ఎర్రన్నాయుడు విగ్రహం వద్ద నుంచి టిడిపి నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మాదిన రామారావు, ఎం.పూర్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు.
జలుమూరు మండలం చల్లవానిపేట నాలుగు రోడ్ల కూడలిలో టిడిపి నాయకులు ఆందోళన చేపట్టి మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు వెలమల రాజేంద్రనాయుడు, దుంగ స్వామిబాబుతో పాటు పలువురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
బూర్జ మండలంలోని 33 మంది టిడిపి నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో సీతారాంబాబునాయుడు, మజ్జి శ్రీరాములు నాయుడు, లంక జగన్నాథంనాయుడు ఉన్నారు.
రణస్థలం జాతీయ రహదారిపై టిడిపి నాయకులు ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న జె.ఆర్.పురం ఎస్‌ఐ రాజేష్ పోలీస్ సిబ్బందితో చేరుకుని 48 మందిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఆర్‌టిసి బస్సులు నిలిపివేత
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఆర్‌టిసి బస్సులను నిలిపివేశారు. ఉదయం 4.30 గంటల నుంచి బస్సులను ఆపేశారు. మార్గమధ్యంలో ఉన్న బస్సులను సమీప పోలీస్‌స్టేషన్లకు తరలించారు. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బస్సుల్లేక గంటల తరబడి ఆర్‌టిసి కాంప్లెక్స్‌ల్లోనే ఉండిపోయారు. కొందరు ప్రయివేట్ వాహనాలు, ఆటోలను ఆశ్రయించారు. ఉదయం 11 గంటలకు బస్సు సర్వీసులను పునరుద్ధరించారు.