ప్రజాశక్తి-చిత్తూరు: ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగమైన "హర్ ఘర్ తిరంగా"కార్యక్రమంలో భాగంగా డాక్టర్ వైయస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జెండాను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి అన్నపూర్ణ శారద ఎగరవేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, భారతదేశం జరుపుకోబోతున్న 75వ స్వతంత్ర దినోత్సవం చాలా విశిష్టమైనదని, భారతీయులందరూ ఆగస్టు 13, 14, 15 తేదీల్లో తప్పనిసరిగా తమ తమ ఇండ్లపై జాతీయ జెండాను ఎగరవేసి జెండాపై , దేశంపై తమకు గల గౌరవాన్ని చాటుకోవాలని తెలిపారు. జెండా వందనము చేసిన పిదప విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు .తర్వాత కళాశాల విద్యార్థులకు పాటల పోటీలను అధ్యాపకులు నిర్వహించారు. విద్యార్థులు తాము స్వయంగా తయారు చేసిన జెండాలను ప్రదర్శించారు. అనంతరం కళాశాలలోని విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం కళాశాల ఆవరణ నుండి డాక్టర్ వైఎస్ఆర్ సర్కిల్ (చవటగుంట) వరకు ర్యాలీ నిర్వహించి, సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి దేశభక్తిని గూర్చిన నినాదములు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రుష్మా, డాక్టర్ శంకర్ రెడ్డి, డాక్టర్ అరుణ, డాక్టర్ మంగళ గౌరీ, డాక్టర్ లావణ్య కుమారి, డాక్టర్ భీమా మోహన్ రావు,డాక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు.










