అయ్యోర్లు లేరు.. విద్యార్థులు రారు..
మూతపడుతున్న ప్రభుత్వ బడులు
ప్రజాశక్తి- వెదురుకుప్పం:
ప్రభుత్వబడుల్లో ఉపాధ్యాయులు సరిగా చదువులు చెప్పరని తల్లిదండ్రుల అభిప్రాయం. ప్రభుత్వబడుల్లో చదువులపై ప్రజల్లో నమ్మకం కల్పించలేకపోతున్నారు ఉపాధ్యాయులు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో వెదురుకుప్పం మండలంలో ఈ ఏడాది ఐదు ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. మరోమూడు అదే దారిలో ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇందులో సద్దికూళపల్లె, చిన్న బొమ్మయ్య పల్లెకాలనీ, తోటానపల్లి, గుండుపల్లి, గంటవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేకపోవడం వలనే బడి మూతపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎంఈఓల చెప్పేది కూడా ఇదే సంత బయలు, తాటిమాకులపల్లె బడుల్లో ముగ్గురేసి విద్యార్థులు ఉన్నారు, ఇక వావిలిచేను ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేక టీచరు మాత్రమే బడికి వస్తున్నాడు. దీంతో ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని తిరుమలయ్యపల్లి స్కూల్‌కి డిప్యూటేషన్ పంపినట్లు ఎంఈఓ 2 దామోదరం తెలిపారు. ఇటీవల వరకు ఆ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులున్నా వారూ టీసీ తీసుకెళ్లడంతో పరిస్థితి మొదటికొచ్చిందని స్థానికులు అంటున్నారు.
ఇదిలా ఉండగా అదే గ్రామం నుంచి 13మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలకు వ్యాన్‌లో వెళుతుండటం గమనార్హం. సద్దికూళపల్లి, తోటనపల్లి పాఠశాలలు మాత్రం మూతపడినట్లు జిల్లా విద్యాశాఖకు సమాచారం ఇచ్చినట్లు ఎంఈఓ 2 దామోదరం తెలిపారు. గుండుపల్లి గంటావారి పల్లె, గుండుపల్లి ప్రాథమిక పాఠశాలలో మూతపడడానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. వావిలిచేనులో ఇద్దరు పిల్లలు టీసీలు తీసుకెళ్లడంతో కాళీ అయిందని అన్నారు. మళ్ళీ తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను చేర్పించేలా చర్యలు తీసుకుంటామని, స్థానిక నాయకులు చెబుతున్నారు వారి ప్రయత్నం ఫలించలేదు.
సంతబైలు గ్రామంలో స్థానిక సర్పంచ్ బోడిరెడ్డి రాజేశ్వరి పెద్దిరెడ్డి, స్థానిక ఎంపీటీసీ భర్త బట్టే సుబ్రమణ్యంతో కలసి ఎంఈఓలు స్థానికులతో సమావేశం ఏర్పాటు చేశారు. వారికి అవగాహన కల్పించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న లోకనాథం విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రతిరోజు కలుస్తున్నట్లు చెబుతున్నారు. వీరి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలని కొందరి అభిప్రాయం.
గ్రామాల్లో అవగాహన కల్పించాం..
మహేశ్వరరావు, దామోదరం ఎంఈఓలు
ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు సంఖ్య తగ్గిన పాఠశాలలను గుర్తించి ఆగ్రామానికి వెళ్లి స్థానిక సర్పంచ్ ప్రజాప్రతినిధులతో సమావేశాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాం. పిల్లలను బడిలో చేర్పించాలని కోరాం. గ్రామీణ ప్రాంతాలలో పిల్లలు బడులకు రాకపోతే ప్రభుత్వ నిబంధనల మేరకు నివేదికను పైస్థాయి అధికారులకు అందజేస్తాం.










